నారా లోకేష్‌ వచ్చేస్తున్నారు… వాట్ నెక్స్ట్?

Nara Lokeshజాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ గురువారం రాత్రి ఢిల్లీ నుంచి విజయవాడకు తిరిగిరాబోతున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి వెళతారు. రేపు ఉదయం జైల్లో చంద్రబాబు నాయుడుని కలుస్తారు.

అనంతరం పార్టీ కార్యాచరణ కమిటీతో సమావేశమయ్యి తదుపరి కార్యాచరణ గురించి చర్చిస్తారు. ఈ సమావేశంలోనే జనసేనతో కలిసి పనిచేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ADVERTISEMENT

నారా లోకేష్‌ ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన కేసులకు భయపడి అక్కడ దాక్కొన్నారంటూ వైసీపి నేతలు ఎద్దేవా చేసేవారు. కానీ ఇప్పుడు నారా లోకేష్‌ రాష్ట్రానికి తిరిగివచ్చేస్తున్నారు. కనుక ఇప్పుడు బంతి వారి కోర్టులోనే ఉందని చెప్పవచ్చు.

నారా లోకేష్‌ని కూడా వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేసేయాలని వైసీపి ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతున్నందున, ఏపీ సీఐడీ అధికారులు ఇటీవల ఢిల్లీకి వెళ్ళి మరీ నారా లోకేష్‌ని ఈనెల 4న విచారణకు హాజరుకావలని నోటీసు ఇచ్చి వచ్చారు.

కానీ ఈ నెల 11వరకు ఆయన జోకికి వెళ్ళవద్దని హైకోర్టు ఆదేశించడంతో నారా లోకేష్‌ని అరెస్ట్ చేయలేని పరిస్థితి! కానీ ఈ కేసు కాకపోతే మరో కేసుతో నారా లోకేష్‌తో సహా టిడిపి ముఖ్య నేతలందరినీ అరెస్ట్ చేసితీరుతామని వైసీపి మంత్రులు ముందే చెప్పేశారు. కనుక ఇప్పుడు ఏపీ సీఐడీ మరో కొత్త కేసు బయటకు తీసి నారా లోకేష్‌కు మరో నోటీస్ ఇస్తుందా?లేక 11వరకు ఓపిక పడుతుందా?అనేది ఆయన ఈరోజు రాత్రి గన్నవరం విమానాశ్రయం చేరుకొనేసరికే తెలిసిపోవచ్చు. అయితే నారా లోకేష్‌ అన్నిటికీ సిద్దపడే తిరిగివస్తున్నారు కనుక వైసీపి ప్రభుత్వమే ఆలోచించుకోవాలి.

చివరిగా ఒక మాట: టిడిపి నేతలతో, తమ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో కూడా తమ ప్రభుత్వం ఎంత క్రూరంగా వ్యవహరిస్తోందో వైసీపిలో అందరూ కళ్ళారా చూస్తున్నారు. రేపు బయటకు వెళితే తమకీ ఇటువంటి ట్రీట్‌మెంటే లభిస్తుందని అందరూ ఈపాటికి గ్రహించే ఉంటారు. కనుక తాము పులి మీద సవారీ చేస్తున్నామని కూడా అందరూ తెలుసుకొనే ఉండవచ్చు.

ADVERTISEMENT
Latest Stories