జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఇళ్ళు కేటాయించడం ఓ ప్రహసనంగా సాగేది. గతంలో చంద్రబాబు నాయుడు హయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో టిడ్కో ఇళ్ళు నిర్మిస్తే వాటన్నిటికీ వైసీపీ రంగులు వేసి మేమే కట్టించామని చెప్పుకున్నారే తప్ప వాటిలో అసంపూర్తి నిర్మాణ పనులను పూర్తి చేయనే లేదు.
జగన్ తన కోసం వందల కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన ప్యాలస్‌లు నిర్మించుకునేవారు కానీ పేదలు నివసించేందుకు కేవలం సెంటు భూమి సరిపోతుందని తేల్చేశారు. వాటిలో అరకొర నిర్మాణాలు చేపట్టి అవీ పూర్తిచేయలేకపోయారు.
తాను అధికారంలో లేకపోయినా ఆంధ్రాకు అమరావతి రాజధాని కాకూడదనే దురాలోచనతో రాజధాని ప్రాంతంలో సెంటు భూములతో లే అవుట్ వేయించి ఇరుగు పొరుగు జిల్లాల నుంచి పేదలను తీసుకువచ్చి పంచిపెట్టారు. రాజధాని ప్రాంతంలో వేసిన ఆ లేఅవుట్, జగన్ ఇచ్చిన ఆ పట్టాలతో వారికి యాజమాన్య హక్కులు లభించకపోగా న్యాయపరమైన సమస్యలు ఎదరుకోవాల్సి వచ్చింది.
జగన్ హయంలో పేదలకు భూ పంపిణీ నిర్వాకం ఇలా సాగితే, వైసీపీ నేతలు అందినకాడికి ప్రభుత్వ భూములు, చివరికి కొండలు, గుట్టలు, చెరువులు కూడా ఆక్రమించేసుకున్నారు.
ఇందుకు పూర్తి భిన్నంగా మంగళగిరిలో నేడు భూపట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న వారి ఇళ్ళకు వెళ్ళి, దంపతులకు బట్టలు పెట్టి మరీ పట్టాలు అందించారు.
ఆ తర్వాత మంగళగిరిలో జరిగిన సభలో నేడు 3,000 మంది పేదలకు ఇళ్ళ పట్టాలు, వాటితో పాటు అందరికీ బట్టలు కూడా పెట్టారు.
లబ్ధిదారులలో కొందరు మహిళలు మంత్రి నారా లోకేష్ ఇళ్ళ పట్టాలు అందిస్తుంటే తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకున్నారు. మరికొందరు నారా లోకేష్‌ని మనసారా దీవించారు. రెండున్నర దశాబ్ధాలుగా ఈ భూపట్టాల కోసం పడిన పాట్లు గుర్తు చేసుకొంటూ చాలా మంది తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ పట్టాల కార్యక్రమంతో ఇవాళ్ళ మంగళగిరిలో పండగ వాతావరణం నెలకొంది. అందరి మొహాలు సంతోషంతో కళకళలాడాయి.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, “2019 ఎన్నికలలో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నేను మీ అందరితో మమేకమయ్యి మీ సాధకబాధకాలు తెలుసుకోగలిగాను. అది నా జీవితంలో చాలా మార్పు తెచ్చింది.
అప్పుడే మీరు ఉంటున్న ఈ భూములకు పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాను. కొన్ని భూములలో అనేక సమస్యలున్నాయి.
నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే అధికారులతో మాట్లాడి ఒక్కో సమస్యని పరిష్కరించి ఇవాళ్ళ మీకు పట్టాలు అందించగలుగుతున్నాను. ఈ భూములకు పట్టాలు ఇవ్వడంలో ఉండే సమస్యలను బట్టి మూడు విడతలలో పట్టాలు అందిస్తానని మాట ఇచ్చాను. అలాగే నేడు మొదటి విడతలో 3,000 మందికి పట్టాలు ఇస్తున్నాను.
ఇందుకు మీరందరూ ఎంతగా ఆనందం పొందుతున్నారో నేను కూడా అంతే ఆనందం పొందుతున్నాను,” అని మంత్రి నారా లోకేష్ అన్నారు. పేదలకు ఇళ్ళు లేదా పట్టాలు ఇవ్వడం అంటే ఇలా కదా?




