నారా లోకేష్‌కి పెద్ద కష్టమే వచ్చింది… ఇప్పుడెలా?

Nara Lokesh smiling as he reacts to his family’s awards and achievements

మంత్రి నారా లోకేష్‌కి పెద్ద కష్టమే వచ్చింది. ఈ కష్టం మరొకరు తీర్చగలిగేది కాదు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తండ్రి చంద్రబాబు నాయుడు కానీ, తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి గానీ ఈ కష్టాన్ని తీర్చలేరు. నిజానికి వారి వల్లనే నారా లోకేష్‌కి ఈ కొత్త కష్టం ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకు ఆయన బాధ పడకపోగా సంతోషిస్తున్నారు!

ఇంతకీ మంత్రి నారా లోకేష్‌కి ఎదురైన కొత్త కష్టం ఏమిటంటే, ఇంట్లో అందరూ చాంపియన్లే ఆయన తప్ప. ‘మా కుటుంబంలో మిగిలిన అందరూ ప్రతిష్టాత్మకమైన అవార్డులు గెలుచుకున్నారు…. నేను మాత్రమే వెనకబడిపోయాను,’ అంటూ మంత్రి నారా లోకేష్‌ ట్వీట్ చేశారు.

ADVERTISEMENT

“తండ్రి ఎకనామిక్ టైమ్స్ ద్వారా ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు గెలుచుకున్నారు. అమ్మ ‘గోల్డెన్ పీకాక్’ అవార్డును ఇంటికి తీసుకొచ్చారు. నా భార్య భారతదేశంలోని ‘బిజినెస్‌లో అత్యంత శక్తివంతమైన మహిళల’ జాబితాలో నిలిచారు. చివరికి మా అబ్బాయి కూడా చెస్ ఛాంపియన్‌… ఎన్నికలలో పోటీ చేసి గెలవడం కంటే ముందు మా కుటుంబంతో పోటీ పడి గెలవడమే కష్టమని తెలుసుకుంటున్నాను,” అని ట్వీట్ చేశారు.

నిజమే కదా? సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఈ వయసులో కూడా ఇటువంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకోవడం మామూలు విషయం కానేకాదు.

సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ ఇద్దరూ రాజకీయాలలో క్షణం తీరికలేని జీవితం గడుపుతుంటే, వాటికి దూరంగా ఉండే భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరూ వ్యాపార రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు.

ఇటువంటి కుటుంబంలో జన్మించిన దేవాన్ష్‌ కూడా వారి కంటే ఏమాత్రం తీసిపోనట్లు ఇంత చిన్న వయసులోనే ‘చెస్ ఛాంపియన్’గా నిలిచారు.

ఒకే కుటుంబంలో ఇంతమంది ఛాంపియన్లు ఉండటం విశేషమే. కనుక ఆ ఛాంపియన్ల మధ్య తానొక్కడినే వెనకబడిపోయానని మంత్రి నారా లోకేష్‌ చెప్పుకున్నారు.

కానీ నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలోనే తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుని ప్రజల మనసులు గెలుచుకున్నారు. మంగళగిరిలో ఓడిపోయిన చోటే భారీ మెజార్టీతో గెలిచి మంత్రి పదవి చేపట్టారు. మంత్రిగా రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ కంపెనీలు రప్పిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇలా ఒకటేమిటి… మంత్రి నారా లోకేష్‌ విజయాల జాబితా చాలా పెద్దదే ఉంది.

కానీ వాటన్నిటికీ కొలమానం అవార్డులు కావు… ప్రజాధరణ, రాష్ట్రాభివృద్ధి మాత్రమే. వాటిలో మొదటిది ఇప్పటికే సాధించారు. రెండోది సాధిస్తే అదే ఆయనకు భారత రత్న అవార్డుతో సమానం.

ADVERTISEMENT
Latest Stories