ఒకప్పుడు రాజకీయాలు చాలా హుందాగా సాగేవి. విమర్శలు, ప్రతి విమర్శలను హుందాగా స్వీకరించేవారు తప్ప ఎదురు దాడి చేసి నోరు మూయించాలనుకునేవారు కారు. కానీ ఇప్పుడు ‘రప్పారప్పా’వరకు వచ్చేశాము. కనుక ఇప్పుడు నైతిక విలువలు, హుందాతనం మెయింటెయిన్ చేయడం చాలా కష్టం. కానీ ఇలాంటి పరిస్థితిలో కూడా మంత్రి నారా లోకేష్ ఓ సత్సంప్రదాయం పాటిస్తున్నారు. కొత్త సంప్రదాయం పరిచయం చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ చక్రం తిప్పుతున్నారని అందరికీ తెలుసు. కానీ అయన పార్టీలో తన కంటే సీనియర్లకు ఇస్తున్న గౌరవ మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి.
ఇటీవల ఓ బహిరంగ సభలో మంత్రి నిమ్మల రామానాయుడుని ఉద్దేశ్యించి “అన్నా…నీతో నేను పోటీ పడలేను. మీతో పోటీ పడాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి. అది నా వల్ల కాదు. కనుక ఆ నంబర్ ఎదో మీరే తీసుకోండి,” అని సరదాగా అంటారు. ఆయనతోనే కాదు.. సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడా నారా లోకేష్ తీరు ఇలాగే ఉంటుంది.
శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజకీయ అనుభవం అంత వయసు నారా లోకేష్‌కి లేదు. అలాంటి సీనియర్ పట్ల మంత్రి నారా లోకేష్ నిన్న శాసనసభ కారిడార్‌లో ప్రదర్శించిన వినయ విధేయతలు అందరినీ ఆకట్టుకుంటాయి. స్పీకర్ అయ్యన కారు వద్దకు వెళుతుంటే నారా లోకేష్ స్వయంగా కారు డోర్ తీసి ఆయన కూర్చున్నాక మూసి బైబై చెప్పి సాగనంపారు!
మంత్రి నారా లోకేష్ మరో కొత్త సత్ సాంప్రదాయం ప్రారంభించారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్య నేతలని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలని తన ఇంటికి ఆహ్వానించి వారికి విందు ఇచ్చారు. అయితే ఈ విందులో రాజకీయాలు మాట్లాడకుండా అందరూ హాయిగా కబుర్లు చెప్పుకున్నారు.
వారిలో అనిత వంగలపూడి వంటి మహిళలకు మంత్రి నారా లోకేష్ బట్టలు పెట్టారు. ఈ విందు ఎంత సరదాగా, ఆప్యాయంగా జరిగిందో అయ్యన్న పాత్రుడు-నారా లోకేష్ ఫోటో చూస్తే అర్ధమవుతుంది.
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కేటీఆర్ తండ్రి నుంచి అహంకారం, నోటి దురుసు, అందరితో కయ్యమాడే గుణాలు నేర్చుకొని పార్టీని నష్టపరుచుకుంటుంటే, మంత్రి నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు నుంచి ఇలా ఎదిగిన కొద్దీ ఒదిగి వినయంగా ఉంటూ అందరినీ కలుపుకుపోతూ, ప్రధాని మోడీ సైతం ప్రశంశించే స్థాయికి ఎదిగారు.
జగన్, కేసీఆర్ కోటరీలు, ఇనుప కంచెలు నిర్మించుకొని అందరినీ దూరం చేసుకుంటే, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, నారా లోకేష్ అందరినీ కలుపుకుపోతూ భవిష్యత్ ఉజ్వలం చేసుకుంటున్నారు. నారా లోకేష్ తన ఇంటి తలుపులు తెరిచి ఈవిధంగా పార్టీలో అందరినీ ఆహ్వానిస్తున్నారు. రాజకీయాలలో రాణించాలనుకునేవారికి ఉండాల్సిన ప్రాధమిక లక్షణం ఇదే!






