టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బుదవారం మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటం గ్రామంలో పర్యటించి, ఇళ్ళు కూల్చబడ్డ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ, “ఓ పక్క ఇళ్ళను కూల్చివేసి ఇళ్లను కూల్చలేదని మంత్రి చెపుతాడు. పైగా సిగ్గులేకుండా ఇక్కడ ఇళ్ళు కూల్చలేదని తమని పరమర్శించడానికి ఎవరూ రానక్కరలేదంటూ కూల్చిన ఇళ్ళ ఎదుటే ఫ్లెక్సీ బ్యానర్లు కూడా పెట్టిస్తున్నారు! ఇది జేసీబీ ప్రభుత్వం. దీనికి కూల్చడమే తప్ప కట్టడం చేతకాదు. గుంతలు పడిన రోడ్లపై తట్టెడు మట్టిపోయలేని ఈ ప్రభుత్వం మారుమూలన ఉన్న ఈ గ్రామంలో రోడ్లు వెడల్పు చేస్తామని చెపుతూ నిరుపేదల ఇళ్ళు కూల్చివేయడం చాలా అమానుషం. ఇదో ఉన్మాద ప్రభుత్వం. దీనికి ఎన్నికల చిహ్నం జేసీబీని ఇస్తే సరిగ్గా సరిపోయేది. మాది సైకిల్ గుర్తు. అంటే సామాన్యులకి అనుబాటులో ఉంటూ వారి శ్రేయస్సు కోసం పనిచేసే ప్రభుత్వం. నేను ఇప్పుడే చెపుతున్నా… వచ్చే ఎన్నికలలో టిడిపి గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. నేను మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవగానే మొట్టమొదట ఈ కూల్చేసిన ఇళ్ళన్నీ పునర్నిర్మిస్తాను. ఇళ్ళు కోల్పోయిన బాధితులకు టిడిపి అండగా ఉంటుంది,” అని అన్నారు.
ఇప్పటం గ్రామంలో కాపు సామాజికవర్గానికి చెందినవారు ఎక్కువగా ఉన్నారు. కనుక మంగళగిరిలో జనసేన ఆవిర్భావ సభకు ఎక్కడ స్థలం లభించకుండా వైసీపీ నేతలు అడ్డుపడితే ఇప్పటం గ్రామస్తులు సభ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చారు. ఆ కక్షతోనే ప్రభుత్వం రోడ్ విస్తరణ పేరుతో గ్రామస్తుల ఇళ్ళు కూల్చివేసిందని పవన్ కళ్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
టిడిపి, జనసేన, వైసీపీల మద్య రాజకీయాలను పక్కనపెడితే, వైసీపీ ప్రభుత్వ కక్షసాధింపులు, పేర్లు మార్పులు, వైసీపీ రంగులు వేయడాలు, ఈ కూల్చివేతలను వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా సమర్ధించుకోలేకపోతున్నారు. తమ ప్రభుత్వ చర్యలపై ప్రజలకు జవాబు చెప్పుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పటంలో గ్రామంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇంతవరకు అడుగుపెట్టలేకపోయారు.
తమ ప్రభుత్వం ఈవిదంగా సామాన్య ప్రజలపై కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటంతో వైసీపీ నేతలు కూడా అసహనంగానే ఉన్నారు. గడప గడపకి కార్యక్రమంలో వారికి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు వారు ప్రజలపై విరుచుకుపడుతుండటమే ఇందుకు నిదర్శనం. వారు అటు తమ జగనన్నకి నచ్చజెప్పలేక ఇటు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక మద్యలో నలిగిపోతూ లోలోన తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ విషయం పైకి చెప్పుకోలేరు కనుక గుడ్డిగా తమ ప్రభుత్వ చర్యలను సమర్ధించుకొంటున్నారు.
అలాగే వాలంటీర్లు కూడా మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిళ్ళు భరించలేకపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కనుక వైసీపీ ప్రభుత్వ చర్యలు, ప్రజలలో నానాటికీ పెరుగుతున్న అసహనం, మారుతున్న రాజకీయ పరిణామాలు… ఇవన్నీ వైసీపీ కొంపముంచడం ఖాయమనిపిస్తోంది. కనుక ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకొని సంయమనంతో వ్యవహరిస్తే వైసీపీకే మంచిది కదా?



