మంగళగిరిలో లోకేష్‌… వైసీపీ అభ్యర్ధి ఎవరో?

Nara Lokesh Mangalagiriటిడిపి యువనేత నారా లోకేష్‌ గత ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసి వైసీపీ అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే నారా లోకేష్‌ ఆ ఓటమిని సవాలుగా తీసుకొని అప్పటి నుంచే నియోజకవర్గం ప్రజలతో మమేకం అవుతూ, సొంత నిధులతో అనేక ప్రజాసమస్యలు పరిష్కరించారు.

ADVERTISEMENT

నిజానికి ఆ పనులన్నీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేయవలసి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో నిధులన్నీ సంక్షేమ పధకాలకు, వాటి కోసం చేసిన అప్పులు, వడ్డీలకే సరిపోతుండటంతో మిగిలిన ఎమ్మెల్యేలలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతులు కూడా కట్టేసినట్లయింది.

అమరావతి విషయంలో జగన్‌ మాటమార్చడం కూడా ఆయనకు శాపంగా మారింది. అయితే గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనడమే ఎమ్మెల్యేల పనితీరుకి ప్రామాణికంగా భావిస్తున్న ఐప్యాక్ బృందం ఆళ్ళ రామకృష్ణారెడ్డి పనితీరు సరిగాలేదని నివేదిక ఇవ్వడంతో వైసీపీ అధినేత జగన్‌ కూడా ఈ సమస్యలన్నిటినీ గుర్తించకుండా ఐప్యాక్ నివేదికనే నమ్ముకొని గంజి చిరంజీవిని మంగళగిరి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.

అంటే ఆళ్ళకు మళ్ళీ టికెట్‌ లభించదని అర్దమవడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు, చివరికి సిఎం జగన్‌ నిర్వహించే గడప గడపకి రివ్యూ సమావేశాలకు కూడా హాజరవడం మానేశారు. కానీ ఐప్యాక్ గంజి చిరంజీవికి కూడా తక్కువ మార్కులు వేయడంతో వైసీపీ అధిష్టానం కర్నూలుకి చెందిన బుట్టా రేణుకని మంగళగిరికి దిగుమతి చేయాలని భావిస్తోంది. కానీ ఆమె బయటి వ్యక్తి కావడంతో మంగళగిరిలో వైసీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, అనుచరులు కూడా అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు.

కనుక ఈసారి మంగళగిరిలో వైసీపీ అభ్యర్ధిని ప్రజలే ఓడించనవసరం లేదు. స్థానిక వైసీపీ శ్రేణులే ఓడించడం ఖాయంగానే కనిపిస్తోంది. కేవలం నాలుగున్నరేళ్ళలో మంగళగిరి నియోజకవర్గం ప్రజల ఆలోచనలలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది?అంటే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వలన మాత్రం కాదని, అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమ పధకాలకు వైసీపీ ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుండటం, మూడు రాజధానుల ప్రతిపాదన, నారా లోకేష్‌ కృషి కారణాలుగా కనిపిస్తున్నాయి.

అయితే ఒక్క మంగళగిరిలోనే కాదు… రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఇంచుమించు ఇదే పరిస్థితి! నిధుల కేటాయించకపోవడం వలన నియోజకవర్గాలు అభివృద్ధికి నోచుకోలేదని అందరికీ తెలుసు. పైగా రాష్ట్రంలో టిడిపి, జనసేనలకు ప్రజాధారణ గణనీయంగా పెరిగింది. ఇప్పుడు బిజెపి కూడా రంగంలో దిగింది. కనుక వాటి నుంచి వైసీపీకి గట్టి పోటీ తప్పదు. కనుక వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories