చంద్రబాబు ని అవమానించడానికి, లోకేష్ ను కించపరచడానికి వైసీపీ ఎంచుకున్న ఆయుధం వ్యక్తిత్వ హననం. విదేశాలలో చదువుకోవడంతో మాతృభాష తెలుగు మీద లోకేష్ కు పట్టు లేకపోవడం, తన రాజకీయ ప్రసంగాలలో తెలుగులో తప్పులు దొర్లడం, ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా పరోక్ష ఎన్నికల పద్దతిలో లోకేష్ రాజకీయ అరంగేట్రం చేయడం ప్రత్యర్థి పార్టీకి అస్త్రంగా మారింది.
అలాగే లోకేష్ పై బాడీ షేమింగ్ విమర్శలు గుప్పించడం, ఆయనను పదేపదే పప్పు పప్పు అంటూ సంబోధించడం, వైసీపీకి అనుకూలంగా తీసుకున్న సినిమాలలో కూడా బాబు కుటుంబసభ్యులను అగౌరపరుస్తూ సీన్లు రాయటం, వాటిని వైసీపీ సోషల్ మీడియాలో, జగన్ నీలి మీడియాలో ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందిన వైసీపీ నాయకులే ఇప్పుడు లోకేష్ ను చూసి భయపడుతున్నారు.
అప్పుడు పప్పు అంటూ లోకేష్ ను లైట్ తీసుకున్న వైసీపీ అధినేత జగన్ సైతం ఇప్పుడు లోకేష్ పేరు జపిస్తూ రెడ్ బుక్ అంటూ లోకేష్ వైసీపీ నేతలను భయపెడుతున్నారు అంటూ ఢిల్లీ స్థాయిలో లోకేష్ ఈజ్ ఫైర్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నోటికి అదుపు లేకుండా లోకేష్ మీద ఎదురుదాడి చేసిన నేతలంతా ఇప్పుడు కలుగులో దాక్కున్న ఎలక మాదిరి సైలెంట్ అయిపోయారు.
దానిలో ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, నగరి రోజా వంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే లు, రామ్ గోపాల్ వర్మ వంటి మాజీ సినీ దర్శకుడు, పోసాని కృష్ణ మురళి లాంటి మాజీ సినీ నటుడు ఇప్పుడు మీడియా ముందు రావడంలేదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లేదు. గతంలో లోకేష్ ను ఒక రాజకీయ నాయకుడుగా కూడా గుర్తించని జగన్ సైతం ఇప్పుడు వైసీపీకి ప్రత్యర్థి లోకేష్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన లోకేష్ ప్రజా సమస్యల మీద, పాలనా విధానాల మీద పూర్తి అవగాహనకు వచ్చారు. ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలను తిప్పికొట్టడంలో, నీలి మీడియాలు అడిగే తలతిక్క ప్రశ్నలకు సమాధానంతో పాటు కౌంటర్ వేయడంలో లోకేష్ ఆరి తేరిపోయారు.
అలాగే తన తండ్రి బాబు అరెస్టైన సమయంలో అటు కుటుంబాన్ని, ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. పనిలోపనిగా జాతీయ మీడియా లో తన పార్టీ గళం బలంగా వినిపించారు. ఓడినచోటే నిలబడ్డాడు. దాదాపు 90 వేల ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి పార్టీని పడగొట్టాడు. తండ్రి చంద్రబాబుకి తోడయ్యాడు, పార్టీకి బలమయ్యాడు.
2024 కూటమి ప్రభుత్వంలో ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుని తన శాఖల మీద పూర్తి అవగాహనతో ముందుకెళ్తున్నారు. మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ, సీనియర్లను గౌరవిస్తూ, జూనియర్లను కలుపుకుంటూ లోకేష్ వేసే ఒక్కో అడుగు వైసీపీ నేతలను భయపెడుతున్నాయి.
గతంలో వైసీపీ ప్రత్యర్థి వర్గాన్నంత బాబు మనుషులుగా అభివర్ణించిన జగన్ ఇప్పుడు లోకేష్ ప్రోద్బలంతోనే వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా అరెస్టవుతున్నారంటూ ఆవిష్కరిస్తున్నారు. అప్పట్లో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఆయన సోదరి వైస్ షర్మిల జగన్ కు బాబు పిచ్చి పట్టిందని, జగన్ కు అద్దంలో ముఖం చూసుకున్నా ఆయనకు బాబే కనిపిస్తున్నారని ఎద్దేవా చేసారు.
అయితే ఈ నేపథ్యంలో జగన్ కు ఇప్పుడు లోకేష్ పిచ్చి పట్టినట్టా.? జగన్ కు ఎటు చేసిన లోకేష్ అతని చేతిలో ఉన్న రెడ్ బుక్కే దర్శనమిస్తున్నట్టు ఉంది అంటూ టీడీపీ శ్రేణులు జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులవుతుంది అనే సామెత మాదిరి పదేపదే ‘పప్పు పప్పు’ అంటూ హేళన చేసిన వైసీపీ నోర్లు ఇప్పుడు అదే లోకేష్ ను చూసి ‘ఫైర్ ఫైర్’ అంటూ గగ్గోలు పెడుతున్నారు.




