ఆంధ్రప్రదేశ్‌కి పారిశ్రామికవేత్తలు, ఐటి కంపెనీలు ఎందుకు రావడం లేదు? అనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు.
కనుక పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు ఏపీకి రావాలంటే ముందుగా వారికి, వారి పెట్టుబడులకు భరోసా కల్పించాలి. ప్రభుత్వం నుంచి, అధికార పార్టీ నాయకుల నుంచి ఎటువంటి ఇబ్బందులు కలుగవనే నమ్మకం కల్పించాలి.
ముఖ్యంగా రాష్ట్రంలో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని జగన్ నమ్మకంగా చెపుతున్నప్పుడు, అదే జరిగితే వందలు, వేలకోట్ల పెట్టుబడులు పెట్టిన తమ పరిస్థితి ఏమిటనే పారిశ్రామికవేత్తల ప్రశ్నకు సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సంతృప్తికరమైన సమాధానం చెప్పి ఒప్పించాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం మరో 5,10 ఏళ్ళు తప్పకుండా ఏవిదంగా కొనసాగుతుందో చెప్పి వారికి నమ్మకం కల్పించాలి.
గతంలో ఎన్నడూ ఇటువంటి సమస్య ఎదురవలేదు. ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని భావించాల్సిన సమయంలో ఈవిదంగా పారిశ్రామికవేత్తలకు, ఐటి కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం కల్పించాల్సి రావడం చాలా బాధాకరమే. ఇది జగన్ నిర్వాకమే అని వేరే చెప్పక్కరలేదు.
మంత్రి నారా లోకేష్ అమెరికాలో వారం రోజుల పర్యటనలో అనేకమంది పారిశ్రామికవేత్తలను కలిసి రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాల్సిందిగా కోరినప్పుడు, వారిలో చాలామంది ఈ ప్రశ్నలే అడిగిన్నట్లు సమాచారం. మంత్రి నారా లోకేష్ ముందుగానే ఇటువంటి ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుందని ఊహించినందున వాటికి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగారు.
కానీ వారం రోజుల పర్యటనలో ఏపీకి పెట్టుబడులు ఏవీ రాలేదు. కానీ కొన్ని ప్రముఖ కంపెనీలు ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి కానీ నారా లోకేష్ బృందాన్ని మరికొన్ని ప్రశ్నలు, వివరణలు కోరిన్నట్లు సమాచారం. వాటితో అవి సంతృప్తి చెందితే జనవరిలో జరిగే దావోస్ సదస్సులో అవన్నీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది.
రాజకీయ పార్టీల మద్య రాజకీయాలు ఏవిదంగా సాగుతున్నా పరిశ్రమలు, పెట్టుబడులకు అవి అవరోధంగా మారకూడదు. కానీ జగన్ పరిశ్రమలను, చివరికి తెలుగు సినీ పరిశ్రమని కూడా రాజకీయ కోణంలో నుంచే చూస్తూ వాటితో కక్షపూరితంగా వ్యవహరించారు.
ఉదాహరణకు దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న లులూ గ్రూప్ విశాఖలో రూ.2,200 కోట్ల పెట్టుబడితో భారీ హైపర్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో ప్రభుత్వం మారింది. జగన్ అధికారంలోకి రాగానే లూలూ గ్రూప్‌ని తరిమేశారు.
ఆ తర్వాత రహేజా గ్రూప్‌ని బ్రతిమాలుకొని రూ.600 కోట్ల పెట్టుబడితో విశాఖలో ‘ఇనార్బిట్ మాల్’ (హైపర్ మార్కెట్) నిర్మించేందుకు ఒప్పించి శంకుస్థాపన చేశారు.
మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ జగన్‌లాగా ఆ సంస్థపై కక్ష కట్టలేదు. దానికి పూర్తి సహకారం అందిస్తుండటంతో శరవేగంగా నిర్మాణపనులు జరుగుతున్నాయి.
సిఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ లులూగ్రూప్ అధినేత యూసఫ్ ఖాన్‌తో ఫోన్లో మాట్లాడి అమరావతికి రప్పించి, విశాఖతో సహా ఏపీలో అన్ని ప్రధాన నగరాలలో షాపింగ్ మాల్స్, కోల్డ్ స్టోరేజ్ గోదాములు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
ప్రభుత్వాలు మారినా ఇటువంటి చక్కటి, స్థిరమైన విధానాలు అనుసరించినప్పుడే పరిశ్రమలు స్థాపించేందుకు, పెట్టుబడి పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారు. చంద్రబాబు నాయుడు ఈ నమ్మకం కలిగించగలుగుతున్నారు. మంత్రి నారా లోకేష్ తాజా అమెరికా పర్యటనలో అదే చేశారు. కనుక దావోస్ సదస్సులో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తోయింది.




