ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ కె నారంగ్ (76) మంగళవారం ఉదయం 9.04 గంటలకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలం వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
నారాయణ్ దాస్ 1980లో సినిమా ఫైనాన్సర్‌గా సినీ రంగంలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి సుమారు 650కి పైగా సినిమాలకు ఫైనాన్స్ చేశారు. అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించడమే కాకుండా, సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా కూడా సినీ పరిశ్రమకు సేవలందించారు. ఏషియన్ గ్రూప్ కింద మల్టీప్లెక్స్, ఏషియన్ థియేటర్స్ స్థాపించారు.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ, నాగశౌర్య హీరోగా లక్ష్య సినిమాలను నారాయణ దాస్ నిర్మించారు. ఇవి కాక నాగార్జున హీరోగా రూపొందుతున్న ‘ది ఘోస్ట్’, కోలీవుడ్ హీరోలు ధనుష్, శివకార్తికేయన్లతో సినిమాలకు ఆయనే నిర్మాత. ఆయన కుమారులు సునీల్ నారంగ్, భారత్ నారంగ్ ఇద్దరూ కూడా సినీ నిర్మాతలే.
సినీ పరిశ్రమతో దశాబ్ధాలుగా అనుబందం కలిగిన నారాయణ దాస్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నారాయణ దాస్ అంత్యక్రియలు జరుగనున్నాయి.



