ఆనాడు గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు …ఇవాళ్ళ కబుర్లు చెప్పి వెళ్ళారు!

narendra-modi-alluri-sitarama-raju-statue-bhimavaram-ప్రధాని నరేంద్రమోడీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, కాళ్ళ మండలం పెద అమిరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోయారు.

వెళ్ళేముందు జరిగిన సభలో ఎప్పటిలాగే నాలుగు ముక్కలు తెలుగులో మాట్లాడి తరువాత హిందీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ అల్లూరి సీతారామరాజు గొప్పదనం గురించి వర్ణించి ఆయనకు వందనాలు తెలుపుకొన్నారు.

ADVERTISEMENT

తెలుగులో ఏవో నాలుగు ముక్కలు మాట్లాడి ప్రజలను ఆక్కట్టుకోవాలనే ప్రయత్నించారు తప్ప రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఏమైనా వరాలు ప్రకటిస్తారని ఎవరూ ఎదురుచూడలేదు కనుక ఎవరూ నిరాశపడలేదు.

కనీసం అల్లూరి సీతారామారాజు గొప్పదనం యావత్ దేశప్రజలకు తెలియజేసేందుకు ఏదైనా ఓ గొప్ప కార్యక్రమం నిర్వహిస్తామనో లేదా ఢిల్లీలో ఆయన విగ్రహం పెడతామనో చెప్పలేకపోయినందుకు ఏపీ ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకంటే ఉత్తరాది స్వాతంత్ర సమరయోధుల గురించి దక్షిణాది రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడ చూసినా వారి విగ్రహాలు, వారి పేర్లతో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, వీధులు ఉన్నాయి. కానీ అల్లూరి సీతారామరాజు అంటే ఎవరో ఉత్తరాది ప్రజలకు తెలియదు. కనుక అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా దేశరాజధానిలో ఆయన విగ్రహం పెట్టిస్తానని చెప్పినా అల్పసంతోషులైన ఏపీ ప్రజలు చాలా సంతోషించేవారు.

కానీ ఆనాడు అమరావతి భూమిపూజకు ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించినప్పుడు గుప్పెడు (పవిత్ర) మట్టి, చెంబుడు (పవిత్ర) జలాలు తెచ్చి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి వెళ్ళిపోయారు తప్ప రాజధాని నిర్మాణానికి అవసరమైన డబ్బు ఇస్తానని ప్రకటించలేదు. రాష్ట్ర ప్రజలందరూ బహుశః ఈ విషయం ఎప్పుడో మరిచిపోయుంటారని ప్రధాని నరేంద్రమోడీ భావించినట్లున్నారు. అందుకే ఇప్పుడు మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి మనకే పాఠాలు చెప్పి వెళ్ళిపోయారు.

ఆనాడు ఇందిరాగాంధీ హయం నుంచి ఇప్పుడు మోడీ హయం వరకు కేంద్రంలో ఏ కూటమి… ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ఎల్లప్పుడూ వాటికి అండగా నిలబడుతూనే ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపది ముర్ముని గెలిపించేందుకు వైసీపీ మద్దతు ఇస్తుండటమే తాజా నిదర్శనం. కానీ కేంద్రంలో ఏ కూటమి… ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ అంటే అలుసే. ఇందుకు తాజా నిదర్శనమే నేటి సభలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగం.

మూడేళ్ళుగా నిలిచిపోయిన రాజధాని అమరావతి నిర్మాణ పనులు మొదలవలేదు. జాతీయ ప్రాజెక్టు పోలవరం మళ్ళీ మొదటికొచ్చింది. రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అప్పులలో కూరుకుపోయిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు వేధింపులకు గురవుతున్నారు. వైజాగ్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన వైజాగ్ స్టీల్ ప్లాంటును అమ్మేస్తోంది కేంద్రప్రభుత్వం.

ఇన్ని సమస్యలున్నా కేంద్రప్రభుత్వం వేటిని పట్టించుకోదు. కానీ ఏపీకి చెందిన పార్టీలు తనకు మద్దతు ఇవ్వాలని కోరుకొంటుంది. ఏపీలో అధికారంలోకి రావాలని కోరుకొంటుంది! ఎందుకు మద్దతు ఇవ్వాలి… ఎందుకు అధికారం ఇవ్వాలి? రాష్ట్ర బిజెపి నేతలే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories