పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై విపక్షాలు ఒక్కసారిగా విరుచుకు పడుతుండగా, ప్రజల కష్టాలను గమనించిన మరికొందరు స్వపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఈ విషయంలో… తమకు సంబంధించిన నేతలకు ముందుగానే సమాచారం అందించి, మోడీ జాగ్రత్త పడ్డారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా ప్రధాని మోడీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారంటూ మీడియా వర్గాలు తాజా కధనాలను ప్రసారం చేస్తున్నాయి.
నోట్లు రద్దయిన డిసెంబర్ 8వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు తమకు సంబంధించిన బ్యాంకు ఖాతాల నివేదికలను అందరూ బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా… ఈ కధనాల సారాంశం. ఈ లావాదేవీలను బహిరంగ పరచడం ద్వారా మోడీ తన పార్టీ నేతలను సచ్చీలతను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే బిజెపి వర్గాలు మాత్రం ఇదొక చారిత్రాత్మక మరియు సంచలన నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి.
అయితే నిజంగా బిజెపి ఎంపీల, ఎమ్మెల్యేల సచ్చీలతలను, మోడీ నిజాయితీని బయటపెట్టాలని భావిస్తే… నవంబర్ 8వ తేదీ నుండి కాదు, అంతకు ముందు మూడు నుండి ఆరు నెలల ముందు నుండి అన్ని బ్యాంకు లావాదేవీలను ప్రజల ముందు ఉంచితే… అప్పుడు అది చారిత్రాత్మక మరియు సంచలన నిర్ణయం అవుతుంది. ప్రస్తుతం చేసిన ప్రకటన మాత్రం ఏదో తూతూ మంత్రంగా బ్యాంకు లావాదేవీలను తెప్పించుకుని… భేష్ అని చెప్పుకోవడం తప్ప దేనికి ఉపయోగం ఉండదు.
నవంబర్ 8వ తేదీ నుండి ఐటీ నిబంధనలు ఉన్న నేపధ్యంలో బిజెపి నేతలు తెలిసి తెలిసి తమ బ్యాంకు ఖాతాలలో ఎందుకు పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు? ఏదో ప్రజల ముందు ఓ తమ నేతల నిజాయితీని నిరూపించామని చెప్పుకోవడానికి మీడియా ప్రకటనలకు ఉపయోగ పడుతుంది తప్ప, నిజంగా అందరి భాగోతాలు బయటకు తీయాలన్న తలంపు, రాజకీయ నాయకుల గుట్టు రట్టు చేయాలని ఉంటే… ఆర్ధిక సంవత్సరం నాటి నుండి లావాదేవీలను బయటకు తీస్తే… ఎవరు ఏమిటో అప్పుడు బయటపడుతుంది.



