మోడీ ఆధ్వర్యంలో నడుస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను దగా చేసే విధంగా సాగుతోందన్న విషయం ఎప్పుడో స్పష్టమైంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకోగలిగినంత తెచ్చుకోవాలి, కొట్లాటకు పోతే ఏముంటుంది? అంటూ సంధి మాటలు చెప్తూ వచ్చిన ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు ముందు, బిజెపితో తెగతెంపులు చేసుకోవడం కన్నా, ఇక ప్రత్యామ్నాయ మార్గం కనపడేలా లేదు.
‘మిత్రపక్షం’ కదా అని ఇన్నాళ్ళ వరకు మంచితనంతో పోరాటం చేసానని కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు కూడా తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్లుగా కనపడుతోంది. ఇప్పటివరకు టిడిపి నేతలకే పరిమితం అయిన ‘కాంగ్రెస్ కు పట్టిన గతే మీకు పడుతుంది’ అన్న హెచ్చరికలు నేడు స్వయంగా చంద్రబాబు నోట నుండి వచ్చాయంటే పరిస్థితి ఎక్కడివరకు వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.
‘మిత్రపక్షం’ అని ఒక విమర్శ చేయడానికి చంద్రబాబు సంకోచిస్తున్నారేమో గానీ, బిజెపి మాత్రం ఏ మాత్రం దూకుడు తగ్గించకుండా రాష్ట్రంలో ఓ పక్కన సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు వంటి వారి చేత తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా, నేడు స్వయంగా కేంద్ర ఆర్ధిక శాఖ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా గానీ, రాయితీలు గానీ ఇచ్చే ప్రసక్తే లేదని మొహమాటం లేకుండా కుండబద్దలు కొడుతూ చెప్పింది.
ఇదొక్కటే కాదు… తెలుగు వారి ఆత్మగౌరవం అని గానీ, సెంటిమెంట్ అని గానీ పట్టించుకుంటే దేశంలో ఉన్న ఇతరులు కూడా అవే డైలాగ్ లు వేస్తూ ‘ప్రత్యేక హోదా’ అడుగుతారని చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రజలను అవహేళన చేయడమే కాదు, ప్రత్యర్ధి రాష్ట్రాలకు కూడా పరోక్షంగా హింట్ ఇచ్చినట్లయ్యింది. ఏపీకి ఇచ్చిన లెక్కలలో ఒక్క రూపాయి కూడా లెక్క చెప్పలేదని, ఇక ఏపీకి ఇచ్చేది ఏమి లేదంటూ చేసిన వ్యాఖ్యలు బిజెపి తీరుకు అద్దం పడుతోంది.
మోడీ సర్కార్ తీరుతో ఏపీలో ఓ మహా ఉద్యమమే అవసరంలా కనపడుతోంది. ఇలాగే సైలెంట్ గా కేంద్రం నిస్సిగ్గుగా చేస్తోన్న వ్యాఖ్యలకు బదులు చెప్పకుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలను చేతకానివారిగా ఢిల్లీ వర్గాలు భావించే అవకాశం పుష్కలంగా కనపడుతోంది. ఈ ఉద్యమానికి ఎవరు శ్రీకారం చుడతారో, ఏ నాయకుడు ముందుండి పోరాడుతాడో అంటూ ఆశగా ఎదురుచూడడం ప్రజల వంతవుతోంది. మోడీకి ఎదురువచ్చే నేత తెలుగు గడ్డపై ఉన్నారంటారా?!



