ఒకరి కుర్చీకి మరొకరు మంట…ఎవరికి కాలుతుందో?

Narendra_Modi_Vs_K_Chandrashekar_Raoప్రధాని నరేంద్రమోడీ నిన్న హైదరాబాద్‌ వచ్చినప్పుడు, “తెలంగాణ ఏర్పడితే ప్రజలకు మేలు జరుగుతుందనుకొంటే, ఒక్క కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని అన్నారు. సిఎం కేసీఆర్‌ కుటుంబ పాలన అవినీతిమయంగా ఉందని కనుక రాష్ట్రంలో అధికార మార్పిడి తధ్యమని,” చెప్పారు.

నిన్న బెంగళూరు వెళ్ళి దేవగౌడ, కుమారస్వామిలతో సమావేశమైన సిఎం కేసీఆర్‌, అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “అనేక మంది ప్రధానులు వచ్చారు…వెళ్ళారు కానీ దేశాభివృద్ధి మాత్రం జరుగలేదు. కనుక కేంద్రంలో ప్రభుత్వం మార్పు అనివార్యం. దానిని ఎవరూ అడ్డుకోలేరు,” అని అన్నారు.

ADVERTISEMENT

ఇక్కడ తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బిజెపి ప్రయత్నిస్తుంటే, సిఎం కేసీఆర్‌ ఢిల్లీలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రయత్నిస్తుండటం విశేషం. అయితే ఇద్దరి ప్రయత్నాలలో ఎవరు విజయం సాధించే అవకాశం ఉందంటే బిజెపికే కాస్త ఎక్కువ అవకాశం ఉన్నట్లు చెప్పవచ్చు.

ఏవిదంగా అంటే, బిజెపి జాతీయ పార్టీ…కేంద్రంలో అధికారంలో ఉంది కనుక టిఆర్ఎస్‌ కంటే చాలా శక్తివంతమైనది. పైగా తెలంగాణలో కాంగ్రెస్‌ బలహీనపడటంతో బిజెపి బలం పుంజుకొంది. కనుక ఒకవేళ తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాలేకపోయినా, మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకొని టిఆర్ఎస్‌కు పక్కలో బల్లెంలా మారే అవకాశం కనిపిస్తోంది.

కానీ కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించినా ఆయన నాయకత్వాన్ని ఉత్తరాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అంగీకరించవు. ఒకవేళ కూటమిగా ఏర్పడినా అది కప్పల తక్కెడగానే ఉంటుంది తప్ప యూపీయే, ఎన్డీయేలాగా బలమైన కూటమిగా నిలువలేదు. ఎందుకంటే, ఉత్తరాది ప్రాంతీయ పార్టీల అధినేతలలో చాలా మందికి ప్రధాని కావాలని తహతహలాడుతున్నారు కనుక! ఇదే కారణంగా గతంలో ఇటువంటి ప్రయోగాలు విఫలమయ్యాయి.

పైగా పదవులు, అధికార లాలస, అవినీతిలో మునిగి తేలుతున్న ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకొని సిఎం కేసీఆర్‌ దేశాన్ని ఉద్దరిస్తానంటే ప్రజలు నమ్మబోరు.

ఇక ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపకూడదనే నిర్ణయానికి సిఎం కేసీఆర్‌ కట్టుబడి ఉంటే, ఆయన వెనక నడిచేందుకు ప్రాంతీయ పార్టీలు సిద్దపడకపోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్‌ను కూడా కలుపుకుపోయేందుకు కేసీఆర్‌ సిద్దపడి, వచ్చే ఎన్నికలలో వారి కూటమి గెలిస్తే అప్పుడు ప్రధాని పదవిని రాహుల్ గాంధీకి పళ్ళెంలో పెట్టి అప్పగించాల్సి ఉంటుంది. దాని కోసమే అయితే కేసీఆర్‌ ఇంత శ్రమ పడటం అనవసరం కదా?

కనుక కేసీఆర్‌ గుణాత్మక మార్పు, దేశాభివృద్ధి అంటూ కూటమి ఏర్పాటు గురించి ఎన్ని మాటలు చెపుతున్నప్పటికీ అది ఆచరణ సాధ్యం కాదనే చెప్పాలి. అయితే, ఒక్కోసారి దేశ ప్రజలు ఇటువంటి ప్రయోగాలకు కూడా అవకాశం ఇస్తుంటారు. ఒకవేళ కేసీఆర్‌ అదృష్టం బాగుంటే అటువంటి అరుదైన అవకాశం లభిస్తుంది. కానీ కప్పల తక్కెడ వంటి ఆ కూటమితో దేశాన్ని ఉద్దరించడం మాట అటుంచి, ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకోవడమే కష్టం అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories