ఢిల్లీ కారు బాంబు ప్రేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) దర్యాప్తు జరుపుతున్న కొద్దీ దిగ్బ్రాంతి కలిగించే విషయాలు బయటపడుతున్నాయి.
దేశంలో నాలుగు ప్రధాన నగరాలలో ఒకేసారి ఈవిదంగానే ప్రేలుళ్ళు జరిపేందుకు మొత్తం 8 మంది (ఆత్మహుతి దళాలు) అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ వారి దురదృష్టం కొద్దీ ఢిల్లీ ప్రేలుడు తర్వాత లభించిన ఆధారాలతో ఎన్ఐఏ మెరుపు వేగంతో దర్యాప్తు జరిపింది.
హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీలో మెడికల్ కాలేజీకి చెందిన బాయ్స్ హాస్టల్ భవనంలోని 13వ నంబర్ గదిలో ఈ ఉగ్రకుట్రలకు పధకాలు రచించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఆ గదిలో లభించిన కొన్ని డైరీలలో మొత్తం 25 మంది పేర్లు కనుగొన్నారు. హాస్టల్ గదిలో నుంచి కొన్ని కెమికల్స్, పత్రాలు, డెయిరీలు వగైరా స్వాధీనం చేసుకున్నారు.
అలాగే మిగిలిన మూడు చోట్ల బాంబు దాడుల కోసం వారు ఏర్పాటు చేసుకున్న మూడు కార్లను ఎన్ఐఏ పట్టుకొంది. ఏపీలో గుంటూరు, విశాఖ, విజయనగరం జిల్లాలో, హైదరాబాద్‌లో కూడా ఎన్ఐఏ బృందాలు సోదాలు జరిపి పలువురిని అదుపులో తీసుకున్నాయి.
గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ నాలుగు రోజుల క్రితం అహ్మదాబాద్ నుంచి కారులో ఆయుధాలు తరలిస్తున్న డా.అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ని అరెస్ట్ చేశాయి.
రాజస్థాన్‌లోని పాకిస్తాన్ సరిహద్దు గ్రామమైన హనుమాన్ ఘడ్ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా ఆయుధాలు డ్రాప్ అవుతుంటాయని, వాటిని తాము కలెక్ట్ చేసుకొని దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న తమ సహచరులకు అందిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ తరహా మరో మూడు బాంబు దాడులు చేయాలని, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో మరోదాడి చేయాలని వారు ప్లాన్ చేసుకున్నారని విచారణలో తేలింది.
డా.అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ని విచారించగా మరో దిగ్బ్రాంతి కలిగించే విషయం బయటపడింది. అతను మరికొందరితో కలిసి ‘రిసిన్’ అనే రసాయనాన్ని (నెర్వ్ గ్యాస్) తయారు చేస్తున్నాడు. దానిని జన సమర్ధం ఉన్న ప్రాంతాలలో ప్రయోగించడం ద్వారా పెద్ద ఎత్తున సామూహిక హత్యలు చేయాలని ప్లాన్ చేశాడు.
దీంతో గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో అతని ఇంట్లో సోదాలు చేసి కొన్ని కీలక పత్రాలు, ఓ ల్యాప్ టాప్, నెర్వ్ గ్యాస్ తయారీకి సంబందించిన కొన్ని ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.
కనుక దేశంలో భారీ విధ్వంసం సృష్టించేందుకు చాలా మంది చాలా కాలం నుంచి కలిసి సన్నాహాలు చేసుకుంటున్నారని స్పష్టమవుతోంది.
ముందుగా ఢిల్లీలో శాంపిల్ చూపారు. కానీ దొరికిపోపోయారు. ఒకవేళ మిగిలిన వారిని, మూడు కార్లని పట్టుకోవడంలో కాస్త ఆలస్యం జరిగినా దేశంలో మరో చోట కారు బాంబు తప్పక పేలి ఉండేది.
కనుక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ గురించి ఆలోచించడం కంటే, జనంలో కలిసిపోయి తిరుగుతున్న ఇలాంటి కరడు గట్టిన ఉగ్రవాదులను ఏరి పారేయడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.






