కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు 2026-27 సం.ల వార్షిక బడ్జెట్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అదివారం స్టాక్ మార్కెట్లకు సెలవు అయినప్పటికీ బడ్జెట్‌పై కొండంత ఆశతో మార్కెట్ తెరుచుకున్నాయి.
కానీ ‘ఫ్యూచర్స్ ట్రేడింగ్’లో ఎడా పెడా పన్నులు వడ్డించడంతో స్టాక్ మార్కెట్స్ కుప్పకూలాయి. సెన్సెక్స్ 2,000 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 700 పాయింట్లు పడిపోయింది. దీంతో చాలా కంపెనీల షేర్లు పడిపోయాయి. వాటిలో పెట్టుబడులు పెట్టినవారు తీవ్రంగా నష్టపోయారు.
సాధారణంగా ప్రతీ బడ్జెట్‌లో రక్షణ రంగానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తుంటారు. కానీ ఈసారి రక్షణ రంగానికి రూ.5,94,585 కోట్లు కేటాయించగా, రవాణా రంగానికి రూ.5,98,520కోట్లు అంటే అధనంగా రూ. 3,935 కేటాయించడం విశేషం.
నిర్మలమ్మ బడ్జెట్‌లో దేశంలో ఏడు ప్రధాన నగరాలను కలుపుతూ ఏడు హైస్పీడ్ రైల్వే కారిడార్లు, ఏపీ, తమిళనాడు, కేరళ, ఓడిశా రాష్ట్రాలలో అరుదైన ఖనిజాలకు ప్రత్యేకంగా రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు, సెమీ కండెక్టర్ రంగానికి రూ.40,000 కోట్లు కేటాయించారు.
ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లలో మూడు హైదరాబాద్‌కు దక్కాయి. నగరాన్ని పూణే, చెన్నై, బెంగళూరు నగరాలను కలుపుతూ వీటిని నిర్మించబోతున్నారు.
క్యాన్సర్ మందులు, డయాబెటిక్ మందులు, విద్యుత్ వాహనాల బ్యాటరీలు, సోలార్ ప్యానల్స్, చెప్పులు ధరలు తగ్గుతాయి. ముఖ్యంగా విదేశాలలో ఉన్నత విద్యలభ్యసించాలనుకునే వారికి కొంత భారం తగ్గుతుంది. ఊహించినట్లే ఈసారి ఆదాయ పన్నులో రాయితీలు ప్రకటించలేదు.
ట్రంప్ దెబ్బలతో అల్లాడుతున్న వాణిజ్య, పారిశ్రామిక, ఐటి, ఆర్ధిక రంగాలకు నిర్మలమ్మ భారీగా ఉపశమనం కలిగిస్తారనుకుంటే అటువంటిదేమీ చేయకపోవడంతో ఈ బడ్జెట్ నిరాశ పరిచిందనే భావించవచ్చు.
బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఏమేమి లభిస్తాయనేది మెల్లగా వెల్లడవుతాయి. కనుక ఇప్పుడే పెదవి విరవడం తొందరపాటే అవుతుంది.






