ఈ ‘వీకెండ్’ పరిస్థితి మరింత ‘దుర్భరం’

No Cash in Banks -Demonetisation Effectకరెన్సీ కష్టాలు దేశ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. రోజు రోజుకు పరిస్థితులు చక్కబడతాయని భావిస్తే… అది కాస్త సీన్ రివర్స్ అవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ కష్టాలు మరింత దుర్భరమయ్యే పరిణామాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. నాలుగో శనివారం సందర్భంగా నేడు, ఆదివారం సెలవు దినాలు కావడం అటుంచితే, సోమవారం నాడు ప్రతిపక్షాలు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో, ఆ రోజు కూడా బ్యాంకులు తెరుచుకోలేని పక్షంలో ప్రజలు తీవ్ర అవస్థలకు గురికావాల్సి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.

మరో వైపు ఏటీఎంలో కూడా డబ్బులు నిండుకోవడంతో ప్రజల తిప్పలు పతాక స్థాయికి చేరుకునే ప్రమాదం పొంచి ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో చాలా బ్యాంకులలో ఇప్పటికే డబ్బులు నిండుకోవడంతో ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నేడు కూడా డబ్బులు చేరుకోలేకపోతే, దయనీయమైన పరిస్థితులలోకి ఏపీ జారుకుంటుందని స్వయంగా బ్యాంకు అధికారులే స్పష్టం చేస్తున్నారు. సగానికి పైగా ఏటీఎంలు గత 15 రోజులుగా పని చేయకపోగా, ప్రస్తుతం పనిచేస్తున్న ఏటీఎంలో డబ్బులు అయిపోయే పరిస్థితి నెలకొంది.

ADVERTISEMENT

కరెన్సీ కొరత తలెత్తిందన్న విషయాన్ని ముందే గమనించిన అధికారులు విత్ డ్రాలను పూర్తిగా తగ్గించేసారు. 24000 ఉన్న విత్ డ్రాలను గత రెండు రోజులుగా కేవలం 4 వేలు, 2 వేలకే పరిమితం చేసారు. దీంతో పరిస్థితులు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. అయితే బ్యాంకు మేనేజర్లు అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో కరెన్సీపై నియంత్రణ విధించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా సామాన్యుడు కష్టాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు.

ADVERTISEMENT
Latest Stories