కోనసీమలో ఇదేం ఖర్మ?

No_Internet_Konaseema_District_Work_from_Homeకశ్మీర్‌లో తరచూ పాక్‌ ఉగ్రవాదుల దాడులు, వేర్పాటువాదుల అల్లర్లు జరుగుతుంటాయి కనుక అక్కడ తరచూ ఇంటెర్నెట్ సౌకర్యం నిలిపివేస్తుంటారు. అమలాపురంలో ఈ నెల 24వ తేదీన అల్లర్లు జరగడంతో ఆరోజు నుంచి నేటి వరకు కోనసీమ జిల్లా అంతటా ఇంటెర్నెట్ సేవలు నిలిపివేశారు.

ADVERTISEMENT

అల్లర్లు జరిగిన మర్నాటికే పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, జిల్లా అంతటా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు తెలిపారు. అల్లర్లకు కారణమని భావిస్తున్న పలువురిని అదుపులో తీసుకొన్నామని చెప్పారు. కోనసీమలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని డిఐజి పాలరాజు స్వయంగా చెపుతున్నప్పుడు, ఇంకా జిల్లాలో ఇంటర్నెట్ సేవలు ఎందుకు పునరుద్దరించలేదని జిల్లాలో ఇంటి నుంచి హైదరాబాద్‌ ఐటి కంపెనీలలో పనిచేసుకొంటున్న ఐటి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్‌ కోతలు ఎలాగూ తప్పడం లేదు ఇప్పుడు జిల్లాలో ఇంటర్నెట్ కూడా నిలిపివేస్తే ఎలా పని చేసుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు.

జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో ఐటి ఉద్యోగులలో కొంతమంది పొరుగు జిల్లాలకు వెళ్ళి అక్కడ బంధుమిత్రుల ఇళ్ళలో ఉంటూ పనిచేసుకొంటుండగా, కొందరు హైదరాబాద్‌ వెళ్ళిపోయారు. మరికొంత మంది ప్రతీరోజు ఉదయం ఆఫీసులకు వెళుతున్నట్లుగా లంచ్ బాక్సులు పట్టుకొని బైకులు, స్కూటీలు వేసుకొని జిల్లా సరిహద్దు వద్ద అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం వద్ద గోదావరి రేవు వద్దకు చేరుకొని, అక్కడ చెట్ల కింద కూర్చొని ల్యాప్‌టాప్‌లతో పనిచేసుకొంటున్నారు.

అయితే అక్కడ ల్యాప్‌టాప్‌ బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవడానికి సౌకర్యం ఉండదు కనుక మద్యలో ఛార్జింగ్ అయిపోతే పనిచేసుకోలేకపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుక తక్షణం కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్ సౌకర్యం పునరుద్దరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో చివరికి ఇంటర్నెట్ కోసం ప్రజలు రోడ్లెక్కాల్సిన పరిస్థితులు దాపురించినందుకు నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు. కోనసీమలో ఐటి ఉద్యోగులు గోదావరి ఒడ్డున చెట్ల కింద కూర్చొని పనిచేసుకొంటున్న ఫోటోలను సిఎం జగన్మోహన్ రెడ్డి దావోస్ సదస్సులో చూపించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఐటి కంపెనీలను కోరి ఉంటే అవి ఎలా స్పందించి ఉండేవో?

ADVERTISEMENT
Latest Stories