“సామాన్యుడు…” దేశ రాజకీయాలన్నీ ఈ పదం చుట్టూనే తిరుగుతుంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నా అది సామాన్యుడి సంక్షేమం కోసమేనని అధికార ప్రభుత్వాలు… ఎలాంటి ఆందోళన చేసినా అది సామాన్యుల హక్కుల కోసమేనని ప్రతిపక్షాలు…. పుంకాలు పుంకాలు డైలాగ్ లు చెప్తుంటారు. నల్లకుభేరులను అంతు చూడడానికే ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయమని 37 రోజుల క్రితం చెప్పిన కేంద్రం, తాజాగా అదే నిర్ణయాన్ని సామాన్యుల కోసమేనని చెప్పే స్థితికి ప్రభుత్వ పెద్దలు వచ్చారు. అలాగే ఈ నోట్ల రద్దు వలన సామాన్యులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు చేసే రాజకీయం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో!
మ్యాటర్ ఇక్కడ కట్ చేసి… ఒక్కసారి ఈ రోజు జరిగిన ఉభయసభల దగ్గరికి వస్తే… ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు మొదలు కాగానే దివంగత ప్రధాని “పివి నరసింహారావు” గారి తనయుడు “పివి రాజేశ్వరరావు” మృతికి సంతాపం తెలిపాయి. ఒక ఎంపీగా విధులు నిర్వహించిన పివి రాజేశ్వరరావుకు సంతాపం తెలపడంలో తప్పు లేదు గానీ… పార్లమెంట్ లో సంతాపం పొందే హక్కు ఒక్క రాజకీయ నాయకులకు, వారి వారసులకేనా? అనే సందేహం సామాన్య ప్రజలకు కలుగక మానదు.
ఓ పక్కన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నిస్వార్ధంగా స్వాగతించి, సహకరించిన అనేక మంది సామాన్య ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల ముందరే తమ తుది శ్వాసను విడుస్తున్నారు. నగదు కోసం బ్యాoకుల ‘క్యూ’ లైన్లోకి వెళ్లి నిరీక్షించి… నిరీక్షించి… సొమ్మసిల్లి పడిపోతున్నారు… తృణప్రాయంగా ప్రాణాలు వదిలేస్తున్నారు. దేశ భవిష్యత్తును శాసించే నిర్ణయంగా భావించిన నోట్ల రద్దుకు, ‘దేశభక్తి’ పేరుతో ప్రాణాలు వదిలిన సామాన్యులకు గుర్తింపు లేదా? వారి ప్రాణత్యాగాలకు విలువ లేదా? కనీసం 2 నిముషాల పాటు సంతాపం పాటించే నైతికత కూడా మన రాజకీయ నాయకులు పాటించనవసరం లేదా?
అయితే ఈ రాజకీయ నాయకులందరూ ఒక విషయం మరిచిపోతున్నారు. చట్టసభలలో కొలువు తీరిన వారందరికీ ఆ హోదా కల్పించింది ఈ “సామాన్యుడి ఓటు” మాత్రమేనని! పోలింగ్ బూతుల వద్ద క్యూ లైన్లో నిలబడి ఓటు వేసి మరీ వారిని అందలం ఎక్కించిన ఘనత సామాన్యులది. మరి అదే సామాన్యులు ప్రభుత్వాలు చేసిన నిర్ణయాలకు బలవుతుంటే మాత్రం ప్రభుత్వాలకు ఎందుకు పట్టడం లేదు. ప్రభుత్వాల ఆలోచన దృక్పధం చూస్తుంటే “సామాన్యుడు సంతాపానికి కూడా సరిపోడు” అన్నట్లుగా ఉంది. రాజకీయ నాయకులు ఆలోచిoచి నిర్ణయాలు తీసుకోపోతే, అదే సామాన్యుడు రేపటి మీ రాజకీయ భవిష్యత్తు పట్ల ‘సానుభూతి’ పలుకులు పలుకుతారన్న విషయం గుర్తుంచుకోవాలి.



