జగన్‌ చెప్పింది నిజమే… ఎమ్మెల్యేలకు జీతాలు అవసరం లేదు!

Debate on no work no pay for MLAs

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ స్పీకర్ల సమావేశంలో పాల్గొన్న ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు “శాసనసభ సమావేశాలకు రానివారికి ‘నో వర్క్-నో పే’ విధానం అమలుచేయడంపై చర్చ జరగాలని విజ్ఞప్తి చేశారు.

ఇదే విషయం విలేఖరులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలియజేసి అభిప్రాయం అడిగితే ఆయన వారు ఊహించని సమాధానం చెప్పారు. “ వాళ్ళు(కూటమి ప్రభుత్వం)ఇచ్చే జీతాలతో ఇక్కడ ఎవరూ బతకడం లేదు. మా పార్టీలో నాయకులు అలాంటి దుస్థితిలో లేరు,” అని అన్నారు.

ADVERTISEMENT

జగన్‌ జవాబు చెంప చెళ్ళుమన్నట్లు ఉన్నప్పటికీ అది నూటికి నూరు శాతం వాస్తవమే. వారే కాదు… మన దేశంలో ఎంపీ, ఎమ్మెల్యేలలో 99 తం మందికి జీతాలు అవసరమే లేదు.

ఎందుకంటే పంచాయితీ ఎన్నికలలో సర్పంచ్ పదవులకే కోట్లు ఖర్చు చేసే వారున్నారు. ఇక శాసనసభ ఎన్నికలలో అయితే ఒక్కోరూ 50-100 కోట్లు అంతకు మించే ఖర్చు చేస్తుంటారు.

మన ప్రజా ప్రతినిధులలో చాలా మందికి ప్రభుత్వ కాంట్రాక్టులు, సైడ్ బిజినెస్సులుగా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు, చేపల చెరువులు ఒకటేమిటి చాలానే ఉన్నాయి. పలువురు ఎమ్మెల్యే ఆ పనులలో చాల బిజీగా ఉంటారు. కనుకనే శాసనసభ సమావేశాలకు హాజరు కాలేకపోతుంటారు. కనుక జగన్‌ చెప్పిన్నట్లు కూటమి ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు వారికి అవసరమే లేదు.

ఇక్కడ ఓ చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. ఒకప్పుడు లెక్కల మాష్టారుగా ఉద్యోగం చేసిన దాడి వీరభద్రరావు తర్వాత రాజకీయాలలోకి వచ్చి ఓ వెలుగు వెలిగారు. ఆయన పేరిట దాదాపు ఓ అరడజను ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. కానీ తాను రాజకీయాలలో తనది ‘మధ్యతరగతి’ స్థాయి అని చెప్పుకున్నారు.

ఓ అరడజను ఇంజనీరింగ్ కాలేజీలున్న రాజకీయ నాయకుడు ‘మద్య తరగతి’కి చెందినవాడనుకుంటే, రాజకీయాలలో ‘నిరుపేదలు’ స్థాయి ఏమిటో ఎవరికీ వారు లెక్క కట్టుకోవలసిందే.

కనుక నీతినిజాయితీ, ప్రజలు, ప్రజాసేవ అంటూ ప్రాకులాడే తెలంగాణ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య వంటి ‘రేర్ పీసులు’ రాజకీయాలలో చాలా తక్కువ మందే ఉంటారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, నదులు, మద్యం ఏదీ వదలకుండా దున్నేసుకున్న వైసీపీ ఎమ్మెల్యేలకు కూటమి ప్రభుత్వం ఇచ్చే జీతం ఓ లెక్కా? అంటే కాదనే జగన్‌ కూడా చెప్తున్నారు కదా? నిజానికి ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సహా ప్రజా ప్రతినిధులకు అమలుచేయాల్సింది ‘నో వర్క్ నో పే’ కాదు గౌరవ వేతనంగా నెలకు వెయ్యి రూపాయలు ఫిక్స్ చేస్తే సరిపోతుంది. అదీ సాంకేతిక, న్యాయ సంబందమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మాత్రమే. శాసనసభకు రాకుండా సొంత వ్యాపారాలు చూసుకోవాలనుకునేవారు రోజుకి పది లక్షలు చొప్పున ప్రభుత్వానికి జామా చేయాలనే కొత్త నిబంధన పెట్టినా ఎవరికీ అభ్యంతరం ఉండక పోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories