వైసీపీ ఎంపీపై నాన్-బెయిలబుల్‌ కేసు నమోదు!

R_Krishnaiah_Rajya_Sabha_MPతానొకటి తాలిస్తే దైవం మరోటి తలుస్తాడంటే ఇదేనేమో? ఆంధ్రప్రదేశ్‌లో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బీసీ అభ్యర్ధులే లేరన్నట్లు తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యను ప్రత్యేకంగా అమరావతికి ఆహ్వానించి మరీ సిఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ టికెట్ కేటాయించారు.

దాంతో ఆంధ్రప్రదేశ్‌లో బీసీలందరూ గంపగుత్తగా వైసీపీ వైపుకి వచ్చేస్తారని ఆశ పడి ఉండొచ్చు. పనిలో పనిగా హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంద్రా ఓటర్లలో బీసీ వర్గానికి చెందినవారు కూడా వచ్చి వైసీపీకి ఓట్లేస్తారని భావించి ఉండొచ్చు.

ADVERTISEMENT

అయితే సరిగ్గా ఇదే సమయానికి హైదరాబాద్‌, రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఆర్.కృష్ణయ్యపై ఓ నాన్-బెయిలబుల్‌ కేసు నమోదైంది. ఆయన కొందరు రౌడీలను వెంటబెట్టుకువచ్చి తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని రవీందర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆర్.కృష్ణయ్యతో పాటు అనుచరులపై నాన్-బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.

కోర్టు ఆదేశాల మేరకు రాయదుర్గం పోలీసులు ఆర్.కృష్ణయ్యతో సహా అనుచరులపై సెక్షన్స్ 447, 427, 506, 384 రెడ్‌ జోన్‌ విత్ 341 కింద కేసులు నమోదు చేశారు. ఆర్.కృష్ణయ్య, ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చిన వైసీపీ ఈ కేసుపై ఇంకా స్పందించవలసి ఉంది.

ఆర్.కృష్ణయ్య ఒకప్పుడు బీసీల కోసం చాలా చిత్తశుద్ధితోనే పోరాడిన మాట వాస్తవం కానీ ఎప్పుడైతే ఆయనను తొలిసారిగా చంద్రబాబు నాయుడు చేరదీసి హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌ నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చారో అప్పటి నుంచి ఆయన ఫక్తూ రాజకీయ నాయకుడిగా మారిపోయారు.

అయితే ఆయనకు ప్రతీసారి అనూహ్యంగా గొప్ప అవకాశాలు వస్తున్నప్పటికీ రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. అది వేరే విషయం. తెలంగాణ ఏర్పడుతున్నప్పుడు జరిగిన ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఆయనను టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించారు.

ఆ తరువాత 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసి దానిలో టికెట్ దొరకదని తెలియగానే వైసీపీలోకి హైజంప్ చేసి మిర్యాలగూడ టికెట్ పట్టారు కానీ ఓడిపోయారు.

అప్పటి నుంచి అగమ్యగోచరంగా గడిపేస్తున్న ఆర్.కృష్ణయ్యకు తంతే బూరెల గంపలో పడినట్లు మళ్ళీ ఇప్పుడు జగనన్న పుణ్యామాని ఏకంగా రాజ్యసభకు వెళ్ళిపోయారు. అయితే మద్యలో ఈ నాన్-బెయిలబుల్‌ కేసు పీక్కి చుట్టుకొంది. కనుక ముందు దీనిని అర్జెంటుగా వదిలించుకోకపోతే ఇంతే సంగతులు!

ADVERTISEMENT
Latest Stories