టాలీవుడ్ ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ గత సెప్టెంబర్ 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. అయితే ఓ తెలుగు టీవీ ఛానెల్ ఈ నెల 23న ఈ మూవీని బుల్లితెరపై ప్రసారం చేయనుందన్న ప్రోమోలపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సదరు ఛానెల్‌పై బుడ్డోడు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా బుల్లితెరపై ప్రసారమైతే, ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అయితే ‘జనతా గ్యారేజ్’ టెలికాస్ట్ పట్ల అభిమానుల ఆగ్రహానికి కారణాలు చెప్తున్నారు. ఈ సినిమా తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది, అలాగే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీని థియేటర్లలో మరికొన్ని రోజులు.., వీలైతే ఓ వంద రోజులు ఆడేలా చేయాలని ఎన్టీఆర్ అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీతో ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకోనున్న సందర్భంగా అభిమానులు పండుగను చేసుకోవాలని భావిస్తున్నారు.
అయితే ఇంతలో వచ్చే ఆదివారం నాడు బుల్లితెరపై ఈ సినిమా రానుండడంతో వారు అవాక్కయ్యారు. బుల్లితెరలో మూవీ వచ్చేస్తే ఇక సినిమా హాల్‌కి అభిమానులు ఎవరు వస్తారని ఆందోళన చెందుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆ ఛానెల్ పై విమర్శలు చేస్తున్నారు. ఇంత త్వరగా జనతా గ్యారేజ్ టీవీల్లో రావాలనుకోవడం లేదని ఒక అభిమాని పోస్టు చేస్తే, ఈ సినిమా టెలికాస్ట్ ను ఆపేయాలంటూ మరో అభిమాని డిమాండ్ చేశాడు. ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకోకూడదు… ‘ఇంత కక్కుర్తి ఎందుకు? ఇక తరువాత కాలంలో ఎన్టీఆర్ మూవీ షూటింగ్‌లో ఉండగానే లైవ్ టెలికాస్ట్ చేసేస్తారా?’ అంటూ రకరకాల ట్వీట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.



