ఇటీవల ఎన్టీటీవీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఓ మహిళా ఐఏఎస్ అధికారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ కధనం ప్రసారం చేసింది.
అందుకు పోలీసులు ఆ న్యూస్ ఛానల్‌కి పనిచేస్తున్న ఇద్దరు రిపోర్టర్లని అరెస్ట్ చేశారు. తర్వాత వారు బెయిల్‌పై విడుదలయ్యారు. అర్దరాత్రి న్యూస్ ఛానల్లో పోలీసుల సోదాలు నిర్వహించడం, ఇద్దరు రిపోర్టర్లని అరెస్ట్ చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
ఈ వ్యవహారంపై ఏబీఎన్ మీడియా సంస్థ అధినేత, ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ పేరిట ఆ న్యూస్ ఛానల్లో నేడు ప్రసారమైన ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’లో సంచలన విషయాలు బయటపెట్టారు.
సింగరేణికి చెందిన రూ.1600 కోట్ల విలువగల నైనీ బొగ్గు గనులను దక్కించుకోవడం కొరకు డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరికి మద్య జరిగిన గొడవ చిలికి చిలికి పెద్దదై ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టుల వరకు వెళ్ళిందని ఏబీఎన్ పేర్కొంది.
కేసీఆర్ హయంలో దీనిని ‘ప్రతిమా శ్రీనివాస్’కు కట్టబెట్టబోతే అడ్డుపడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు దానిని తన సోదరుడికి చెందిన సుశీ హైటెక్ కంపెనీకి కట్టబెట్టాలని ప్రయత్నించారని పేర్కొంది. కానీ దీనిని ఎలాగైనా దక్కించుకోవాలని డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అనుకున్నారు.
సింగరేణి సంస్థ ఆయన చేతిలోనే ఉందిప్పుడు. కనుక ఇతరులు ఎవరికీ ఈ కాంట్రాక్ట్ దక్కకుండా చేసేందుకు ‘ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్’ అనే కొత్త నిబంధనని తెచ్చి అడ్డుకున్నారని ఏబీఎన్ పేర్కొంది.
ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి అల్లుడు కంపెనీ వెన్సర్‌కు కూడా బొగ్గు మైనింగులో బొత్తిగా అనుభవం లేదు. కనుక మేఘా కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి ఈ భారీ కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
కానీ దీని కోసం సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గట్టిగా పట్టుబడుతుండటంతో, నరేంద్ర చౌదరి తన చేతిలో ఉన్న ఎన్టీవీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాసలీలలు అంటూ మహిళా ఐఏఎస్ అధికారుల గురించి అనుచిత కధనం ప్రసారం చేయించారని ఏబీఎన్ పేర్కొంది.
ఆ ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులలో ఒకరు ఈ అవమానం భరించలేక ఆత్మహత్యాయత్నం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఆగ్రహం చెందారు. సాటి మహిళా అధికారులకు ఐఏఎస్ అధికారుల సంఘం బాసటగా నిలబడి, సిఎం రేవంత్ రెడ్డి అనుమతి, ప్రమేయం లేకుండానే సిట్ ఏర్పాటు చేశారు.
ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టుల వెనుక ఇంత పెద్ద కధ నడిచిందని ‘వీకిండ్ కామెంట్ బై ఆర్కే’లో బయటపెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు సీనియర్ మంత్రుల మద్య ఈ గొడవ జరుగుతోంది. కనుక దీనిని రాజకీయ అవకాశంగా భావించిన కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ హడావుడిగా మీడియా ముందుకు వచ్చి జర్నలిస్టులను అరెస్టులని ఖండించారని ఏబీఎన్ పేర్కొంది.
దీనిపై వెంటనే స్పందించిన డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఏ ఉద్దేశ్యంతో ఈ కట్టుకధ అల్లి తనపై బురద జల్లుతోందో తెలీదన్నారు. కానీ త్వరలో పూర్తి వివరాలతో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతానని అన్నారు.
తెలంగాణ ప్రయోజనాల కోసమే మా పోరాటాలు అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆ పోరాటాలు తమ ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాల కోసమే అని అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఈవిధంగా దోచుకుంటున్నారని ఏబీఎన్ బయటపెట్టింది!






