వన్ బై టు టీ లేదా కాఫీ అని విని ఉంటాము కానీ వన్ బై త్రీ తరగతులు అనే మాట ఎప్పుడైనా విన్నారా… చూశారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చూసి తరించవచ్చు. పాఠశాలల నిర్వహణభారం తగ్గించుకొనేందుకు వాటిని మూసివేసి ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం. ఇదే మన జగనన్న నూతన విద్యావిధానమన్న మాట! ఈ విధానంలోనే ఈ వన్ బై త్రీ తరగతులు పుట్టుకొచ్చాయి. వన్ బై త్రీ తరగతులంటే ఒక క్లాసురూములో ఒకే సమయంలో ముగ్గురు టీచర్లు మూడు వేర్వేరు తరగతుల పిల్లలకు పాఠాలు చెపుతుంటారన్న మాట! ఇదెలా సాధ్యం అనకండి.. ఈ ఫోటో చూస్తే మీకే తెలుస్తుంది.
అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో పాఠశాలలలోని 3,4,5 తరగతులకు చెందిన 124 మంది విద్యార్థులను యాకిడిలోనే ఉన్నతపాఠశాలకు బదిలీ చేశారు. కొత్తగా వచ్చిన ఈ 124 మంది విద్యార్థులకు పాఠాలు భోదించేందుకు వేర్వేరుగా తరగతి గదులు లేకపోవడంతో వారందరినీ ఒకే గదిలో మూడు దిశలలో కూర్చోబెట్టి ముగ్గురు ఉపాధ్యాయులు పాఠాలు భోధించారు. అయితే ఇది చాలా విచిత్రంగా ఉండటంతో విద్యార్థులు తమ వెనక కూర్చొన్న తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల వైపు ఆశ్చర్యంగా చూస్తూ వారితో కబుర్లు చెపుతూ కాలక్షేపం చేస్తుండటంతో వారిని నియంత్రించడం ఉపాధ్యాయులకు చాలా కష్టమైంది.
లేడికి లేచిందే పరుగు అన్నట్లు జగన్ ప్రభుత్వం హడావుడిగా పాఠశాలలను విలీనం చేయడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. చక్కగా నడుస్తున్న పాఠశాలలను మూసివేసి, విలీన పాఠశాలలో అదనపు విద్యార్థుల కోసం తరగతి గదులు, టాయిలెట్లు, మధ్యాహ్న భోజన సౌకర్యం వంటివి కల్పించాలనే ఆలోచన చేయకపోవడంతో అదనపు విద్యార్థుల చేరికతో విలీన పాఠశాలలో తరగతి గదిలో పాఠాలకు, భోజన సమయంలో భోజనాలు చేసేందుకు, టాయిలెట్ల వద్ద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే మన విద్యావ్యవస్థలో పెను మార్పు అని సరిపెట్టుకోవాలేమో?
ఇది ఒక్క జిల్లాలోనో, మండలంలోనో ఉన్న సమస్య కాదు. దాదాపు అన్ని జిల్లాలు, మండలాలో పాఠశాలలో ఇటువంటి సమస్యలే నెలకొన్నాయి. ఇటువంటి అనాలోచిత ప్రయోగాల వలన ఉత్తీర్ణత శాతం తగ్గితే అప్పుడు గత ప్రభుత్వాన్ని నిందిస్తూ కొత్త కధలు చెప్పడం జగన్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయింది.