ఒక్క వివాదం: ఎన్నో ఆరోపణలు, మరెన్నో ప్రశ్నలు.?

One Dispute in BRS: Many Allegations and Many Questions

కవిత తెగింపు…కేసీఆర్ మౌనం…కేటీఆర్ నిస్సహాయత…హరీష్ రావు నిట్టూర్పు…నాయకుల అసహనం… క్యాడర్ నిస్తేజం…ఇవన్నీ ప్రస్తుతం తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ లో నెలకొన్న తాజా పరిస్థితులు.

అసలు బిఆర్ఎస్ లో ఏం జరుగుతుంది.? జాగృతి తో ఏం జరగబోతుంది.? బీజేపీలో విలీనం దిశగా బిఆర్ఎస్ వెళ్లబోతుందా.? కవిత జాగృతి బిఆర్ఎస్ లో అంతర్భాగమేనా.? ఇలా ఎన్నో ప్రశ్నలు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారుతున్నాయి.

ADVERTISEMENT

అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగిన ఒకే ఒక్క నాయకుడు, చెప్పాల్సిన బాధ్యత ఉన్న అధినేత కేసీఆర్ మాత్రం తన మౌన దీక్షతో పార్టీ కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తున్నారు. కవిత జాగృతి తో బిఆర్ఎస్ కారుకి నానాటికి దూరంగా జరుగుతున్నారు.

అలాగే ఇటు హరీష్ రావు నుంచి అటు కేటీఆర్ వరకు కవిత మీద పరోక్ష విమర్శనా బాణాలను ఎక్కుపెడుతున్నారు. ఇక పార్టీ క్యాడర్ కేసీఆర్ ఒక కన్నైయినా కేటీఆర్ వైపు నిలబడాలా.? లేక రెండవ కన్నైన కవిత వైపు మొగ్గుచూపాలా.? అన్న మీమాంశలో కేసీఆర్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.

కవిత ఆవేశంతో రాజకీయంగా తప్పటడుగులు వేస్తున్నారా.? లేక అవసరం తీరాక తెప్పతగలేస్తున్నారా.? అన్న ఆరోపణలు మోస్తున్నారు. కేటీఆర్ పార్టీలో ఆధిపత్య హక్కు కోసం కవిత పై పొమ్మనలేక పొగ పెడుతున్నారా.? లేక కవిత పార్టీ లక్ష్మణ రేఖ దాటిందని భావిస్తున్నారా.? అన్న నిందలు ఎదుర్కుంటున్నారు.

ఇన్నాళ్లు కేసీఆర్ కు నమ్మిన బంటు లా గులాబీ కారుకి స్టీఫనీ టైర్ లా నిలబడిన హరీష్ రావు ఈనాడు కేసీఆర్ కి కట్టప్పగా మారనున్నారా.? బిఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ గా మిగలనున్నారా.? అన్న ప్రశ్నలు హరీష్ ను శీల పరీక్షకు సిద్ధం చేస్తున్నాయి. ఇలా బిఆర్ఎస్ లో మొదలైన ఒక్క వివాదం ఆ పార్టీ 25 ఏళ్ళ ప్రస్థానం పై ఎన్నో ఆరోపణలను లేవనెత్తుతుంది, ఆయా నాయకుల చుట్టూ ఎన్నో రాజకీయ ప్రశ్నలను సంధిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories