ప్రతిపక్షాలు ప్రభుత్వాలను శాసిస్తుంటే…

YSRCP and BRS pressure affecting Andhra Pradesh and Telangana governments

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై వైసీపీ, బీఆర్ఎస్‌ పార్టీల ఒత్తిడి ఉంది. ఉంటుంది కూడా. ప్రభుత్వాలపై ప్రతిపక్షాల ఒత్తిడి అవసరం కూడా! అయితే ఆ ఒత్తిడి ప్రభుత్వ పనితీరును మెరుగుపరిచేందుకు ఉపయోగపడాలి తప్ప ప్రభుత్వ విధానాలను శాసించకూడదు. ప్రభుత్వాలు కూడా వాటి ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు.

ఉదాహరణకు ఏపీలో మెడికల్ కాలేజీల వ్యవహారంలో వైసీపీ ఒత్తిళ్లు ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారాయి. ఈ విషయంలో ముందుకు సాగనీయకుండా అడ్డుపడుతోంది.

ADVERTISEMENT

తద్వారా కూటమి ప్రభుత్వంపై రాజకీయంగా పైచేయి సాధించామని వైసీపీ సంతోషించవచ్చు. కానీ పీపీపీ పద్ధతిలో కేవలం రెండేళ్లలో మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేసుకొని, సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం లేకుండా పోతోంది కదా?

జగన్‌ ప్రభుత్వం 5 ఏళ్ళలో నాలుగో ఐదో హాస్పిటల్స్ కట్టగలిగింది. ఈ లెక్కన మిగిలినవన్నీ కట్టడానికి ఎన్నేళ్లు పడుతుంది? రెండేళ్లలో పూర్తికాగల హాస్పిటల్స్‌కు అన్నేళ్లు పారితే ఆలోగా వాటి ద్వారా లభించే వైద్య సేవలు, మెడికల్ సీట్లు, అన్నీ చేజారిపోతాయి కదా?

ఇదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్‌ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గుతోంది. తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను మా ప్రభుత్వం సమర్థంగా అడ్డుకుంటోంది,” అని అన్నారు.

తెలంగాణకు దిగువన ఉన్న రాష్ట్రంలో రైతులు, ప్రజల అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సముద్రంలో వృథాగా కలుస్తున్న నీటిని వాడుకునేందుకు సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అందుకు సంతోషించాలి. అభినందించాలి కదా? కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్‌ పార్టీలాగే ప్రాంతీయవాదంతో ఎందుకు మాట్లాడుతోంది? దాని జాతీయస్ఫూర్తి ఏమైపోయింది?

అంటే జాతీయస్ఫూర్తి అనేది నేతి బీరకాయలో నెయ్యి వంటిదేనని బీఆర్ఎస్‌ పార్టీ నిరూపించింది. దానితో రాజకీయంగా పోటీ పడక తప్పడం లేదు కనుక ఇప్పుడు జాతీయ పార్టీకి చెందిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ప్రాంతీయవాదంతో మాట్లాడుతోంది.

ఈ విధంగా ప్రతిపక్షాలు ప్రభుత్వ ఆలోచనలను, నిర్ణయాలను, విధానాలను ఇంతగా ప్రభావితం చేస్తుంటే, ప్రభుత్వాలు స్వేచ్ఛగా ఎలా పనిచేయగలవు?

ADVERTISEMENT
Latest Stories