జగన్‌ పద్దులు అప్పజెప్పడమేనా… ఏమైనా చేసేదుందా?

Pattabhi Ram Kommareddy YS Jagan Fencing Scam

టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళగిరి టిడిపి ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్‌ హయాంలో ప్రజాధనం దుబారా గురించి వివరించారు.

ADVERTISEMENT

తాడేపల్లి ప్యాలస్‌ చుట్టూ ప్రభుత్వ ధనంతో పెద్ద ఇనుప కంచె నిర్మించుకున్నారని దీని కోసం రూ.12.85 కోట్లు ఖర్చు చేశారని, రైతుల పాస్ పుస్తకాలపై తన బొమ్మలు ముద్రించడానికి రూ.13 కోట్లు, ప్రభుత్వ భవనాలకు వైసీపి రంగులకు రూ.3,000 కోట్లు, సర్వే రాళ్ళపై తన బొమ్మల రూ.700 కోట్లు, ఋషికొండ ప్యాలస్‌ కొరకు రూ.500 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.

ఇదివరకు టిడిపి ప్రతిపక్షంలో వైసీపి అధికారంలో ఉండేవి. కనుక అప్పుడు జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను, తప్పుడు నిర్ణయాలను, దుబారా ఖర్చులను ఎత్తిచూపిస్తూ టిడిపి నేతలు విమర్శించేవారు.

కానీ ఇప్పుడు టిడిపియే అధికారంలో ఉంది. అయినప్పటికీ సిఎం చంద్రబాబు నాయుడు మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల వరకు జగన్‌ హయాంలో చాలా దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, దుబారా జరిగాయని చెపుతూ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలక్షేపం చేస్తుండటంపై సోషల్ మీడియాలో టిడిపి మద్దతుదారులే తప్పు పడుతున్నారు.

ముందు వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని, అవినీతి సొమ్ముని, వారు కబ్జా చేసిన ప్రభుత్వ భూములను విడిపించి వాటి గురించి ప్రజలకు చెపితే సంతోషిస్తారని, కానీ ఇలా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి జగన్‌ హయాంలో జరిగిన అరాచకాలకు, అవినీతికి పద్దులు అప్పజెప్పి ఏం ప్రయోజనం?అని ప్రశ్నిస్తున్నారు.

తాడేపల్లి ప్యాలస్‌ కోసం కోట్లు విలువచేసే ఫర్నీచర్ కొనుగోలు చేశారని, ఎగ్ పఫ్‌ల కోసం కోట్లు ఖర్చు చేశారని చెప్పడమే కానీ ఇంతవరకు వాటిలో ఒక్క రూపాయి వెనక్కు రాబట్టగలిగారా?లేనప్పుడు ఈ విమర్శలెందుకు? ఇది చాతకానితనం కాదా?అని సోషల్ మీడియాలో టిడిపి అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

టిడిపి మెతక వైఖరి కారణంగానే వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలు మళ్ళీ ఇంతగా రెచ్చిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వారి గోడు యావత్ ప్రపంచం వింటోంది. కానీ టిడిపి అధిష్టానం చెవిలో ఇంకా ఎప్పుడు పడుతుందో?

ADVERTISEMENT
Latest Stories