కాకినాడ జిల్లా ఉప్పాడలో ఫార్మా కంపెనీల వలన సముద్ర జలాలు కలుషితమై భారీగా చేపలు చనిపోతున్నాయని, తమ జీవనోపాధి కోల్పోతున్నామని ఉప్పాడ మత్స్యకారులు మంగళవారం ధర్నా చేసి నిరసన తెలిపారు. దీనిపై డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందిస్తూ సోషల్ మీడియాలో వారికి వివరణ ఇచ్చారు. ఉప్పడ మత్స్యకారుల సమస్యల గురించి తనకు తెలుసునని వాటి పరిష్కారం కోసం ఇప్పటికే పలు చర్యలు చేపట్టానని తెలియజేశారు. శాసనసభ సమావేశాలు ముగియగానే స్వయంగా వచ్చి మత్స్యకారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.
ఇక్కడ మూడు విభిన్న అంశాలున్నాయి. 1. మత్స్యకారులు సమస్యపై డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించడం. 2. ఫార్మా కంపెనీల కాలుష్యం అరికట్టడంలో కాలుష్య నివారణ మండలి అలసత్వం లేదా వైఫల్యం. 3. పరిశ్రమల ఏర్పాటు చేయాల్సిన అవసరం.
కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇంత వేగంగా స్పందించడం, ఈ సమస్య పరిష్కారానికి తాను చేస్తున్న ప్రయత్నాలను వివరించడం చాలా అభినందనీయం. ప్రజలు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు తమ సమస్యలపై ఇటువంటి స్పందనే ఆశిస్తుంటారు. కనుక ఈ సమస్య పరిష్కరించడంలో ఆలస్యమవుతున్నా, పవన్ కళ్యాణ్ ప్రజల మనసులు గెలుచుకుంటున్నారని చెప్పవచ్చు.
వరుసగా రెండు పెద్ద ఎదురుదెబ్బలు తిని తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు రప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఇల్లలకాగానే పండగ కాదన్నట్లు పరిశ్రమలు రప్పించి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తే సరిపోదు. ఇటువంటి సమస్యలని కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండాలి. దీని కోసమే కాలుష్య నియంత్రణ మండలి, దానిలో వందలాది మంది అధికారులు, సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వం నెలనెలా వందల కోట్లు జీతభత్యాలు చెల్లిస్తోంది. కానీ కాలుష్య మండలి పనితీరు ఎన్నడూ ప్రశంశనీయంగా ఉండదు.
పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం అరికట్టాల్సి ఉండగా, ఆ కాలుష్యమే వారి జేబులు నింపుకునేందుకు ఉపయోగపడుతోంది. ఇక పారిశ్రామికవేత్తలు కూడా కాలుష్యశుద్ధి ప్రక్రియ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కంటే ఇదే సులువనుకుంటారు. దీనికి శాశ్విత పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వాలు బాధితులకు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటాయి. ఇప్పుడూ అదే జరిగే అవకాశం ఉంది. కనుక ఇటువంటి సమస్యలు ఎప్పటికీ అపరిష్కృతంగానే మిగిలిపోతాయి.
ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి
•పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ
•అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యల్నీ గుర్తించాముఫార్మాస్యూటికల్ పరిశ్రమల ప్రభావం వల్ల తమ జీవనోపాధి మీద ఏర్పడుతున్న ప్రభావాలను గురించి ఉప్పాడ ప్రాంత…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 24, 2025






