డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నేడు చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ భూములలో హెలికాఫ్టర్‌లో ఏరియల్ సర్వే చేసి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆక్రమించుకున్న 76.74 ఎకరాల భూమికి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ ఆక్రమణలపై అటవీశాఖ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అటవీశాఖ కంటే ముందు మిథున్ రెడ్డి స్పందించారు. “మిస్టర్ పవన్ కళ్యాణ్, మీరు ఇలాంటి షూటింగ్స్, హడావుడి చేయడం మీకు మీరే సాటి. ఎర్ర చందనం దొంగలను పట్టుకుంటానంటూ హడావిడి చేసి ఆ తర్వాత పారిపోయారు. ఇప్పుడు ఏరియల్ సర్వే పేరుతో హడావుడి చేసి మేము అటవీభూములు కబ్జా చేశామని ఆరోపించారు.
కానీ వాటిని మేము 2000లో చట్టబద్దంగా కొని మా పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. అప్పుడు మేము అధికారంలో కూడా లేము. ఆ రికార్డులన్నీ అధికారిక వెబ్‌సైట్లోనే ఉన్నాయి. వాటిపై పలుమార్లు విచారణ జరిపి వాటిలో ఎటువంటి అవకతవకలు లేవని అధికారులు తేల్చారు.
కనుక ఇలాంటి ఆరోపణలు చేసే ముందు ఆ రికార్డులన్నీ పరిశీలించి ఉంటే బాగుండేది. కానీ మా కుటుంబం పట్ల మీకున్న ద్వేషభావంతోనే మేము అటవీభూములు కబ్జా చేశామని ఆరోపిస్తున్నారు. మీరు చేసిన ఆరోపణలు నిరూపించగలరా?లేకుంటే క్షమాపణలు చెపుతారా?” అంటూ మిథున్ రెడ్డి సోషల్ మీడియాలో సవాలు విసిరారు.
కూటమి ప్రభుత్వం ఈ 17 నెలల్లో వైసీపీ నేతలపై కేసులు పెట్టడమే తప్ప ఏ ఒక్క కేసులో వారిని దోషులుగా నిరూపించి శిక్షలు పడేలా చేయలేకపోతోంది.
కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా మొదలు మద్యం కుంభకోణం కేసు వరకు అన్ని కేసుల పరిస్థితి ఇదే. కనుక పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములు కబ్జా చేసిందని కేసు పెట్టినా అదీ ఇలాగే అటకెక్కిపోవచ్చు.
పైగా అవన్నీ చట్టబద్దంగా తాము రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములని మిథున్ రెడ్డి చాలా ధైర్యంగా చెపుతున్నారు. దమ్ముంటే నిరూపించమని సవాలు కూడా విసురుతున్నారు కూడా!
కనుక ఈ వ్యవహారం కనీసం నోటీసుల వరకైనా వెళుతుందో లేదో? కానీ మిథున్ రెడ్డి ఇలా సవాలు చేసిన తర్వాత డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ దానిని స్వీకరించకపోయినా, వెనక్కు తగ్గినా, మౌనంగా ఉండిపోయినా ఆయనే నవ్వుల పాలవుతారు.






