ఎప్పుడు డిఫరెంట్ రాజకీయం చేస్తా అని చెప్పుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నారా లోకేష్ విషయంలో కాస్త తడబడుతున్నట్టే కనిపిస్తుంది. టీడీపీని విరోధించాలి అనే ఏకసూత్రంతోనే లోకేష్ పై అభియోగాలు చేసేసి ఆ తరువాత వాటిని సమర్ధించుకోవడానికి తిప్పలు పడుతున్నట్టుగా కనిపిస్తుంది.
నారా లోకేష్ అవినీతి అంశాలకు గాను రాష్ట్రంలో జనవాక్యంగా ఉన్న మాటలనే తాను గతంలో చెప్పానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఆ ఆరోపణలు నిరూపించడానికి.. ‘ఎవరైనా రసీదు ఇచ్చి లంచం తీసుకుంటారా?’ అని పవన్ ప్రశ్నించారు. లోకేష్ అవినీతి రాష్ట్రంలోని కోట్లమంది ప్రజలకు తెలిసిందేనన్నారు.
రాజకీయాలలో అందరికి తెలిసిందే కదా? ఎవరైనా రసీదు ఇచ్చి లంచం తీసుకుంటారా? లాంటి మాటలు చెల్లుబాటు అవుతాయా? ఇటువంటి విమర్శలు, వాటి సమర్దనలు జనసేనకు పవన్ కళ్యాణ్ కు చేటు చేస్తాయి కానీ మేలు చెయ్యవు. పవన్ కళ్యాణ్ పై కూడా జన బాహుళ్యంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటిని తెచ్చి ఆయనను నిందించి అందరికి తెలిసిందే కదా అంటే ఆయనకు ఎలా ఉంటాది?
దీనిపై పరువు నష్టం దావా వేద్దామని లోకేష్ భావిస్తే పవన్ కళ్యాణ్ ఇరుకున పడొచ్చు. ఇటీవలే కాలంలో ఇలాంటి వ్యాఖ్యలే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసి ఆ కోర్టుకు వెళ్లి ఆ తరువాత బహిరంగ క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. అటువంటి అనుభవాలు పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం మంచివి కావు!



