పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తాజా చిత్రం “దువ్వాడ జగన్నాథమ్” టీజర్ కు ఎన్నడూ లేని విధంగా డిస్ లైక్స్ రావడానికి కారణం పవన్ అభిమానులేనంటూ బన్నీ అభిమానులు ఆరోపణలు చేయడంతో, ఫ్యాన్స్ మధ్య వేడి రాజుకుంది. ‘కాటమరాయుడు’ టీజర్ కు కూడా ఇదే తరహాలో డిస్ లైక్స్ వచ్చాయని, ఈ పని బన్నీ అభిమానులే చేశారని పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోల అభిమానుల గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రముఖ నిర్మాత, బన్నీ తండ్రి అల్లు అరవింద్ రంగంలోకి దిగినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సమస్యకు తక్షణం పరిష్కారం చూడకపోతే, ‘డీజే’ సినిమాకు నెగెటివ్ ప్రచారం మరింతగా పెరిగిపోయే అవకాశం ఉందని అరవింద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ‘డీజే’ సినిమాలోని ఓ పాటను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయించడం ద్వారా పవర్ స్టార్ అభిమానులను శాంతింప చేసేందుకు అరవింద్ యత్నించనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా వెబ్ ప్రపంచంలో జరుగుతున్న ఈ ఫ్యాన్స్ వార్ ను మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లి వారి సహకారాన్ని తీసుకోవాలని అరవింద్ చూస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలయ్యే నాటికి వాతావరణాన్ని అంతా కూల్ చేసి, బాక్సాఫీస్ వద్ద బన్నీకి రాజమార్గాన్ని ఏర్పాటు చేయడానికి అరవింద్ రంగం సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. వరుస విజయాలతో ఉన్న అల్లు అర్జున్ కెరీర్ ను “దువ్వాడ జగన్నాధమ్” ద్వారా మరో మెట్టు ఎక్కించే విధంగా చూడాలన్నదే అరవింద్ ప్రయత్నంగా తెలుస్తోంది.



