రెండు రిలీజ్ డేట్స్ ను పరిశీలిస్తూ “భీమ్లా నాయక్” పోస్టర్ ను నిర్మాతలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ఒకటి ఈ నెల 25వ తేదీన. అయితే ఈ తేదీన రిలీజ్ అన్నది సాధ్యం కాకపోవచ్చు, ఒకవేళ అలా రిలీజ్ చేయాలంటే ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల విషయంలో పూర్తిగా సహకరించాలన్న భావన సర్వత్రా వ్యక్తమయింది.
ఇదే భావనను కాకపోయినా, దాదాపుగా ఇలాంటి అభిప్రాయాన్నే ‘భీమ్లా నాయక్’ ప్రొడ్యూసర్ కూడా తాజాగా వ్యక్తపరిచారు. ‘భీమ్లా నాయక్’ సినిమాను నిర్మించిన నాగవంశీనే “డీజే టిల్లు” సినిమాను కూడా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా 4వ తేదీన విడుదల కానున్న నేపధ్యంలో నిర్వహించిన ప్రమోషన్ ఈవెంట్ లో మీడియా వర్గాలు ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ పై స్పందించారు.
“భీమ్లా నాయక్” రిలీజ్ ఎప్పుడు అనేది జగన్ గారిని అడగాలి అన్న నిర్మాత నాగవంశీ, మరో ఆలోచనలకు తావివ్వకుండా, ‘నైట్ కర్ఫ్యూ ఎప్పుడు తీసేస్తే అప్పుడు’ అన్న స్పష్టత ఇచ్చారు. నిర్మాత ప్రకటన ఇలా ఉంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం ఫిబ్రవరి 14 వరకు ప్రస్తుతం ఉన్న కర్ఫ్యూను కొనసాగిస్తూ కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఓ వైపు దేశంలో ఇతర రాష్ట్రాలన్నీ కరోనా నిబంధనలను సడలిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంటే, జగన్ సర్కార్ మాత్రం కరోనా నిబంధనలను మరికొంతకాలం అమలయ్యేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది కూడా ‘భీమ్లా నాయక్’ సినిమాను నిలువరించడానికే అన్న టాక్ అభిప్రాయం పవన్ అభిమానుల నుండి వ్యక్తమయింది. తాజాగా నిర్మాత వంశీ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలను బలపరుస్తోంది.