జనవరి 7వ తేదీన “ఆర్ఆర్ఆర్” విడుదల మరియు 14వ తేదీన “రాధే శ్యామ్” రిలీజ్ లు ఉండడంతో పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమా విడుదల అనివార్యం అయ్యింది. ఇందు నిమిత్తం జరిగిన చర్చలు సఫలీకృతం కావడంతో, ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేరుతో నిర్మాతలందరూ ఏకమై ప్రెస్ మీట్ ను నిర్వహించారు.
ఇందులో ‘భీమ్లా నాయక్’ వాయిదా మినహా ఇతర విషయాలేవీ ప్రస్తావించలేదు. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25వ తేదీన “భీమ్లా నాయక్” రిలీజ్ కాబోతోందని దిల్ రాజు స్పష్టం చేస్తూ, ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చినబాబు మరియు హీరో పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రొడ్యూసర్ దానయ్య గారు, ‘థాంక్స్ టు చినబాబు, థాంక్స్ టు త్రివిక్రమ్, థాంక్స్ టు పవన్ కళ్యాణ్’ అంటూ ముగించేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్స్ లలో ‘ఆల్ ది బెస్ట్’ అన్న ఒక్క పదం పలికిన దానయ్య గారు, ఈ ప్రెస్ మీట్ లో ‘థాంక్స్’ని మాత్రమే ప్రస్తావించారు.
ఈ వాయిదా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను మిగులుస్తోంది. నిజానికి ‘భీమ్లా నాయక్’ వాయిదా తప్పదనే విషయం ప్రతి నాలుగైదు రోజులకొకసారి సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తుండగా, ఇలా జరిగిన ప్రతిసారి ప్రొడ్యూసర్ ఓ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ జనవరి 12 విడుదల అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు.
దీంతో ఏది ఏమైనా తమ హీరో సినిమా వాయిదా పడదని అభిమానులు బలంగా విశ్వసించారు. కానీ ఇపుడు ఆ కలలన్నీ కల్లోలం కావడంతో సహజంగానే నిరుత్సాహం అలుముకుంటోంది. ముఖ్యంగా ఓమిక్రాన్ రూపంలో మరోసారి కరోనా ముప్పు పొంచి ఉందన్న వార్తలు పవన్ ఫ్యాన్స్ ను మరింత నిరాశలోకి నెడుతోంది.
ఇప్పుడిప్పుడే ఓమిక్రాన్ ఇండియాలో తన ప్రభావం చూపుతుండడం, ఫిబ్రవరి మాసానికి ఓమిక్రాన్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుంది, అప్పటికి కొన్ని లక్షల సంఖ్యలో కేసులు ఉంటాయన్న ముందస్తు ప్రకటనలతో, అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళన అటు సినీ వర్గాలతో పాటు, ఇటు అందరి హీరోల అభిమానుల్లో నెలకొని ఉంది.
ఇక ఈ ప్రెస్ మీట్ లో మహేష్ అభిమానులను ఖుషీ చేసే విషయాన్ని కూడా దిల్ రాజు ప్రకటించారు. ఫిబ్రవరి 25వ తేదీన మా “ఎఫ్ 3” రిలీజ్ అనుకున్నాం, కానీ ‘భీమ్లా నాయక్’ రావడంతో, తదుపరి డేట్స్ చూస్తే ఏప్రిల్ 1వ తేదీన మహేష్ సినిమా ప్రకటించి ఉన్నారు, 14వ తేదీన ‘కేజీఎఫ్’ ఉంది గనుక 29వ తేదీన ‘ఎఫ్ 3’ రిలీజ్ చేస్తున్నాం అన్నారు.
గత రెండు రోజులుగా ‘భీమ్లా నాయక్’ వాయిదా వార్తలతో ‘సర్కార్ వారి పాట’ కూడా మళ్ళీ వాయిదా పడుతుందన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమయ్యాయి. కానీ దిల్ రాజు గారు తాజాగా చేసిన వ్యాఖ్యలతో ముందుగా అనుకున్న ఏప్రిల్ 1వ తేదీకే “సర్కార్ వారి పాట” రిలీజ్ అవుతుండడం మహేష్ బాబు అభిమానులకు ఉపశమనాన్ని కలిగించింది.
సంక్రాంతి మాసం తర్వాత ఏ సినిమా రిలీజ్ అవ్వాలన్నా కూడా కొన్ని ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ను ప్రకృతి నిర్ణయించనుంది. అదే కరోనా మరో రూపం! ఇది డేంజర్ బెల్స్ మ్రోగించనంత వరకు అటు సినీ పరిశ్రమతో పాటు హీరోల అభిమానులు కూడా హ్యాపీనే. గత రెండేళ్లుగా ఫిబ్రవరిలో మొదలై జులై, ఆగష్టుల వరకు తన ఉనికిని ఓ రేంజ్ లో చాటుకుంటున్న వైనం తెలిసిందే కదా!



