సినీ పరిశ్రమలో తనకున్న స్టార్ డం, ఫ్యాన్ బేస్ ను పక్కన పెట్టి మరి జనసేన తో రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తొలి అడుగులోనే ఓటమి అనే అవమానాన్ని ఎదుర్కొన్నారు, ప్రత్యర్థి చేతిలో హేళన అనే ఛీత్కారాన్ని చవి చూసారు.
2014 లో JSP పార్టీతో తెలుగు రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టిన పవన్ ఆ ఎన్నికలలో ఏపీలో టీడీపీ + బీజేపీ భాగస్వామ్యానికి మద్దతు పలికి వారి గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేసారు, అలాగే వైసీపీ ఓటమిలో ప్రముఖ పాత్ర పోషించారు.
ఇక 2019 ఎన్నికలలో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగి తానూ పోటీ చేసిన రెండు స్థానాలలోను ఓటమిని మూటకట్టుకున్నారు, అలాగే JSP పోటీ చేసిన సుమారు 100 సీట్లల్లో కేవలం ఒక్క సీట్లో మాత్రమే విజయం సాధించి, మిగిలిన అన్ని చోట్ల ఘోర ఓటమిని చవి చూసింది.
అయితే పవన్ తన ఓటమిని తన పార్టీ అపజయాన్ని ఒక పాఠంగా మార్చుకుని 2024 ఎన్నికలలో తిరిగి టీడీపీ, బీజేపీ లతో కూటమి కట్టి jsp పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచి 100 % స్టైక్ రేట్ తో దేశ రాజకీయాలలో ఒక సరికొత్త రికార్డు ను సృష్టించగలిగింది.
ఇక్కడ పవన్ రాజకీయ వ్యూహాలు, జనసేన రాజకీయ పోరాటాలు ఏపీ ప్రజల హృదయాలు గెలిచాయి. దాని ఫలితమే 164 సీట్లలో కూటమి అధికారంలోకి రావడంతో పాటు వైసీపీ ని 11 సీట్లకు పరిమితం చెయ్యగలిగింది. నాటి ఓటమితో పవన్ కుంగిపోతే రాజకీయాల నుండి జనసేన కనుమరుగైపోయేది, లేదంటే మరో ప్రజా రాజ్యం మాదిరి విలీనం తో ఉసురు తీసుకునేది.
కానీ పవన్ ఆ ఓటమిలో కూడా ఒక అవకాశాన్ని చూసారు, చివరికి కూటమిలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనే అధికార అందలం ఎక్కారు అలాగే జనసేన పార్టీని ప్రభుత్వంలో భాగం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఈ పీకే మాదిరి బీహార్ రాజకీయాలలో కూడా ఒక పీకే ఓటమితోనే తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
అయితే ఇప్పుడు బీహార్ ఎన్నికలలో తన రాజకీయ అదృష్టం పరీక్షించుకోవడానికి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ అధినేతగా కొత్త అవతారం ఎత్తారు. బీహార్ రాజకీయాలను ప్రాక్షాళన చేస్తాను, అక్కడి ప్రజలను రాజకీయ చైతన్యవంతులుగా మారుస్తాను అంటూ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ‘జన్ సూరజ్ పార్టీ’తో బరిలోకి దిగారు పీకే.
అయితే ఆ పీకే (పవన్ కళ్యాణ్) మాదిరే ఈ పీకే (ప్రశాంత్ కిషోర్) కి కూడా తొలి అడుగులో ఘోర ఓటమి పలకరించింది. అక్కడ jsp మాదిరే ఇక్కడ jsp కూడా పోటీ చేసిన అన్ని స్థానాలలో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవడం సరికాదు కదా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది.
దీనితో ఈ ఘోర ఓటమికి పూర్తి బాధ్యత తనదే అంటూ ప్రకటించారు JSP అధినేత పీకే. గతంలో ఇతర పార్టీల గెలుపు కోసం రాజకీయ వ్యూహాలు రచించిన పీకే ఇప్పుడు తన సొంత పార్టీ గెలుపు కోసం తన పార్టీ నాయకుల విజయం కోసం ప్రణాళికలు వేయలేకపోయారు అంటూ విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో పడ్డారు.
దీనితో పీకే రాజకీయ అధినేతగానే కాదు చివరికి ఎన్నికల వ్యూహకర్తగా కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యారు అనే అవమాన భారాన్ని మోస్తున్నారు. అయితే ఈ ఓటమిని, తన పతనాన్ని ఒక గుణపాఠంగా మార్చుకుని తిరిగి పార్టీ గెలుపు కోసం బీహార్ రాజకీయ పీఠం కోసం అవమాన్ని ఎదురొడ్డి పోరాడతానని ప్రశాంత్ ప్రకటిస్తున్నారు.
దీనిబట్టి చూస్తే ఈ పీకే కి ఆ పీకే ఆదర్శంగా నిలిచారా.? ఆ JSP ఈ JSP కి రాజకీయ స్ఫూర్తిగా నిలిచిందా.? అంటూ కామెంట్స్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి పవన్ మాదిరి ప్రశాంత్ తన పార్టీని ఓటమి అనే సునామి నుంచి కాపాడుకుని గెలుపు అనే నావ ఎక్కించగలరా.? అలాగే అవమానం అనే కంచెను దాటి అధికారం అనే అందలం ను చేరుకోగలరా.? అనేది కాలమే బదులు చెప్పాలి.






