పొత్తులో ఎన్ని సీట్లు తీసుకోవాలో వైసీపి నాకు చెప్పాలా?

Pawan-Kalyan-JanaSena-TDP-Seat-Sharing

ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌‌మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, రాబోయే ఎన్నికలలో రాజోలు, రాజానగరం రెండు చోట్ల నుంచి మనమే పోటీ చేయబోతున్నామంటూ సంచలన ప్రకటన చేశారు.

చంద్రబాబు నాయుడుకి పార్టీలో ఒత్తిళ్ళు ఉన్నట్లే తనకూ ఉంటాయని అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. చంద్రబాబు నాయుడు మండపేట, అరకు స్థానాలకు టిడిపి అభ్యర్ధులను ప్రకటించడంతో రగిలిపోతున్న జనసేన శ్రేణులను చల్లబరచడానికే ఈ ప్రకటన చేసిన్నట్లు ఆయన మాటలను బట్టి అర్దమవుతూనే ఉంది. ఈ సందర్భంగా ఆయన టిడిపి, వైసీపిల మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయనకు చాలా రాజకీయ అనుభవం ఉంది. కనుక నారా లోకేష్‌, టిడిపి నేతలు టిడిపి, జనసేనలు అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకోవడం సహజం. అది నేను అర్దం చేసుకుని మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే తొందరపడి మాట్లాడితే మా పొత్తులు దెబ్బ తింటాయని!

అయితే చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా మండపేట, అరకు సీట్లకు టిడిపి అభ్యర్ధులను ప్రకటించినప్పుడు, మా పార్టీ నేతలు చాలా ఆందోళన చెందారు. వారితో నేను మాట్లాడి ఈవిషయంపై సంయమనం పాటించాలని త్వరలోనే చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తానని నచ్చజెప్పాను. పొత్తులో ఉన్నప్పుడు సీట్ల సర్దుబాట్లు ఇరుకు చొక్కా వేసుకున్నట్లే అనిపిస్తాయి. కానీ సర్దుకుపోక తప్పదు.

నాకు రాజకీయాలు తెలియవని కొందరు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. ఏమీ తెలియకుండానే రాజకీయాలలోకి వచ్చానా?ఉంటున్నానా? టిడిపితో పొత్తులో 50 సీట్లు తీసుకోమని కొందరు, 60 సీట్లు తీసుకోమని కొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు. మేము ఎన్ని సీట్లు తీసుకోవాలో వైసీపి నాయకులు మాకు చెప్పాలా?వాళ్ళు చెప్పకపోతే మాకు తెలియదా?అని పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారు.

రాష్ట్రంలో జనసేన ఖచ్చితంగా పెరిగింది కనుకనే ఆ పార్టీ అంత ఆత్మవిశ్వాసంతో ఉందని అర్దమవుతూనే ఉంది. కానీ జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మరికొన్ని లక్షల ఓట్లు, కొన్ని సీట్లు వస్తాయేమో కానీ సొంతంగా అధికారంలోకి రాలేదని పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా చెప్పారు. కనుకనే టిడిపితో పొత్తుకి సిద్దపడ్డారు.

టిడిపి ఇప్పటికే పలుమార్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బలమైన నేతలు, లక్షలాది కార్యకర్తలు ఉన్నారు. టిడిపి పెద్ద పార్టీ కనుక 175/25 స్థానాలలో మెజార్టీ సీట్లు తీసుకోవాలనుకోవడం కూడా సహజమే.

ఒకవేళ జనసేన 60-70 సీట్లు ఆశిస్తున్నట్లయితే, పవన్‌ కళ్యాణ్‌ చెప్పుకొంటున్నట్లు వైసీపిని, జగన్మోహన్‌ రెడ్డిని ఓడించాలనే ఆయన లక్ష్యం నెరవేరకపోగా వైసీపికి సాయపడి జగన్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేందుకు తోడ్పడిన్నట్లవుతుంది కూడా. కనుక వైసీపిని ఓడించి అధికారంలోకి రావడమే ముఖ్యమనుకుంటే, సీట్ల విషయంలో జనసేనకు పట్టువిడుపులు చాలా అవసరం.

ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయిన పవన్‌ కళ్యాణ్‌ తాను కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటున్నాని చాలాసార్లు చెప్పారు కదా? కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే పవన్‌ కళ్యాణ్‌ కానీ జనసేన గానీ నొచ్చుకోవలసిన అవసరమే లేదు.

ఇప్పుడు రాష్ట్రంలో టిడిపి, జనసేనలకు చాలా అనుకూల రాజకీయ వాతావరణం, వైసీపి దాని అధినేత జగన్మోహన్‌ రెడ్డికి చాలా వ్యతిరేక వాతావరణం నెలకొని ఉంది. కనుక టికెట్ల కోసం పంతానికి పోయి ఇలాంటి గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంటే, ఆ తర్వాత జగన్మోహన్‌ రెడ్డి టిడిపి, జనసేన రెండు పార్టీలను కనబడకుండా తొక్కేయడం ఖాయం.

కనుక పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన్నట్లు పొత్తులలో భాగంగా సీట్ల సర్దుబాటు అనే ఇరుకు చొక్కాకు అలవాటు పడకతప్పదు. టిడిపికి కూడా ఇదే వర్తిస్తుంది. కనుక ఆ పార్టీ నేతలు కూడా వాస్తవ పరిస్థితులను గమనించి సంయమనం పాటిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలాగ అధికారంలోకి రాగలుగుతారు. లేకుంటే మరెన్నటికీ ఇలాంటి అవకాశం వారికి రాకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories