పవన్ త్రిబుల్ రైడింగ్: జనసేనకు ప్రమాదం..!

Pawan Kalyan Should Think About Strengthening The Party

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది కాలం పూర్తి చేసుకుంది. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాల్గవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఎమ్మెల్యే గా గెలిచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

జనసేన, బీజేపీ లతో కలిసి తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ అందుకు తగ్గట్టుగానే మంత్రి పదవుల నుంచి పాలనా పరమైన వ్యవహారాల వరకు మిత్ర ధర్మాన్ని పాటిస్తూ వస్తుంది.

ADVERTISEMENT

ఇక సీఎం గా బాబు తన మంత్రి వర్గంలో ఏకైక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ను ఎంపిక చేసి ఆయనకు తగిన ప్రాధాన్యం, గౌరవము ఇచ్చారు. అలాగే ఈ ఏడాది కాలంలో మూడు పార్టీల మధ్య ఎటువంటి రాజకీయ విభేదాలు చోటు చేసుకోలేదు సరికదా సమయం చిక్కినప్పుడల్లా బాబు, లోకేష్, పవన్ ల మధ్య ఏర్పడిన మైత్రి బంధం మరింత బలంగా బయటకు కనిపిస్తూనే వస్తుంది.

అందులో భాగంగానే రాష్ట్ర ప్రగతికి ఈ కూటమి బంధం మరో 15 నుంచి 20 ఏళ్ళు ఇలానే కొనసాగుతుంది అంటూ పవన్ పదేపదే నొక్కివక్కాణిస్తున్నారు. అయితే టీడీపీ, జనసేనల బంధం అంటే రాష్ట్రంలో రెండు ప్రధాన సామజిక వర్గాలైన కమ్మ, కాపు ఏకీకరణ అవుతుంది. ఈ పొత్తు కూటమికి రాజకీయంగా మరింత శక్తిని ఇస్తుంది.

అయితే ఈ సమీకరణ లెక్కలన్నీ కూడా మూడు పార్టీల కూటమి పొత్తు విషయంలో ఉన్న రాజకీయ అంచనాలు, కానీ జనసేన పార్టీ విషయానికొస్తే పార్టీ ప్రభుత్వంలో భాగమయ్యి ఏడాది గడిచింది. మరో నాలుగేళ్లు జనసేన ఖచ్చితంగా అధికారంలో ఉంటుంది. ఈ నాలుగేళ్ళ సమయం జనసేన బలోపేతానికి అత్యంత కీలకం.

గడిచిన ఏడాది కాలంలో పవన్ తన పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, పార్టీ నాయకత్వ పటిష్ఠతకు ఎటువంటి ప్రణాళికలు రచించారు అని చూస్తే శూన్యమనే చెప్పాలి. ఈ ఏడాది విలువైన రాజకీయ సమయాన్ని పవన్ తన పార్టీ పటిష్టత కోసం వినియోగించుకోకపోవడం పార్టీ శ్రేణులను కూడా నిరాశకు గురి చేస్తుంది.

గత ఎన్నికలలో జనసేన పార్టీ తరుపున పోలింగ్ బూత్ లో కూర్చునే బలమైన నాయకులు కూడా పార్టీకి లేరు అంటూ బహిరంగంగా ప్రకటించిన పవన్ మరి ఈ ఏడాదిలో ఆ సమస్యకు పరిష్కార మార్గాలు ఏమైనా వెతికారా.?

పార్టీ బూత్ లెవెల్ కార్యర్తలను నియమించగలిగారా.? పార్టీ ముందున్న సంస్థాగత నిర్మాణ సమస్యను అధిగమనించేలా నాయకులను తయారు చెయ్యగలిగారా.? అన్నఎన్నో ప్రశ్నలకు జనసేన వద్ద ఇప్పటికి సమాధానం లేదు.

టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు వార్డు స్థాయి వరకు సరైన నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. కానీ జనసేన విషయంలో ఇది జరగలేదు, కనీసం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అయినా పవన్ వీటి పైన ద్రుష్టి పెడతారు అనుకున్న జనసైనికులకు, పవన్ అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురవుతుంది.

పార్టీ గెలిచిన 21 నియోజకవర్గాలలోని జనసేన బలోపేతానికి పవన్ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పార్టీ గెలిచిన ఎమ్మెల్యే లతోను చర్చలు, సమావేశాలు నిర్వహించిందే లేదు. అటు సినిమాలు ఇటు రాజకీయాలు అంటూ ఇప్పటికే రెండు పడవల మీద ప్రయాణం చెయ్యాలని చూస్తున్న పవన్, ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలను మోస్తూ మూడో పడవ మీద కాలు మోపుతున్నారు.

దీనితో జనసేన పార్టీ బలోపేతానికి పవన్ కు అనుకూలమైన సమయం కూడా వెచ్చించలేకపోతున్నారు. అయితే పవన్ పార్టీ పటిష్టత పై పెట్టాల్సిన శ్రద్ధను ఇతర పార్టీల బలోపేతానికి వెచ్చిస్తూ పార్టీని గాలికొదిలేస్తున్నారు అనే భావన సొంత పార్టీ అభిమానులలోను కనిపిస్తుంది. బీజేపీ మత రాజకీయ వ్యూహంలో పవన్ చిక్కుకుని బయటకు రాలేకపోతున్నారా.? ఆనం సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తన మూర్కత్వపు రాజకీయాలతో న్యూట్రల్ ఓటింగ్ ని దూరం చేసుకుంటుంది. వాటిని ఒడిసిపట్టుకోగలిగేలా జనసేన రాజకీయ అడుగులు వెయ్యగలిగితే అది వైసీపీ ని రాజకీయంగా దెబ్బకొట్టినట్టవుతుంది. ఆ దిశగా జనసేన ముందుకెళ్లని అంటే పార్టీ గ్రౌండ్ లెవల్ వరకు బలమైన నాయకత్వం ఉండాలి.

బాలినేని వంటి వైసీపీ ముఖ్య నేతలు జనసేన పార్టీలో చేరినప్పటికీ రాజకీయంగా స్తబ్దుగానే ఉన్నారు. కనీసం ఇప్పటికైనా పవన్ ఇతర పార్టీల బలోపేతానికి పక్క రాష్ట్ర రాజకీయాలలో వేలు పెట్టకుండా సొంత పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలి.

లేకుంటే రాబోయే భవిష్యత్ కాలంలో జనసేన పురోగతిలో మార్పు శూన్యమే అవుతుంది. దీని బట్టి చూస్తే పవన్ త్రిబుల్ డ్రైవింగ్ జనసేనకు అత్యంత ప్రమాదకరం అనేది పవన్ గ్రహించగలగాలి.

ADVERTISEMENT
Latest Stories