ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల పవన్ కళ్యాణ్ ప్రేమ, నిబద్దతని ఎవరూ ప్రశ్నించలేరు. ఆయన ఆలోచనలు, మాటలు, పార్టీ శ్రేణులకు చేస్తున్న దిశానిర్దేశం కూడా వాటికి అద్దం పడుతోంది. జగన్ పాలనలో కుక్కలు చించిన విస్తరిలా మారిన ఆంధ్రప్రదేశ్‌ని రక్షించుకోవాలంటే టిడిపి, జనసేనల పొత్తు ఒక్కటే సరిపోదని, అది మరో పదేళ్ళపాటు నిలిచే అంత బలంగా ఉండాలని పవన్ కళ్యాణ్ చెపుతున్నారు.
తమ పొత్తులు కేవలం రెండు పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే కాదని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, భవిష్యత్‌కు కూడా చాలా అవసరమని జనసేనలో ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ నొక్కి చెపుతున్నారు.
బీజేపీతో పొత్తు ఉన్నంత మాత్రం తాను ముస్లింలకు వ్యతిరేకిస్తున్నట్లు కాదని, రాష్ట్రంలో అన్ని మతాలు, అన్ని కులాల ప్రజలు తనకు సమానమే అన్నారు. జగన్, వైసీపి నేతల బారి నుండి ఏపీని కాపాడుకోవడానికి ఇదే చివరి అవకాశమని ప్రజలు, పార్టీలో అందరూ గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
అయితే ప్రజలు జనసేనను నమ్మాలంటే పవన్ కళ్యాణ్ ఇంతకు మించి చాలా చేయాల్సి ఉంటుంది. తక్షణమే బీజేపీతో పొత్తుపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే వైసీపి నేతలు ప్రజలను గందరగోళపరుస్తూనే ఉంటారు. దాని వలన జనసేనతో పాటు టిడిపి కూడా నష్టపోతుంది.
టిడిపి, జనసేనలు సీట్ల సర్దుబాటు చేసుకొని ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎవరెక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడే ప్రకటిస్తే, రెండు పార్టీలలో అసంతృప్తి మొదలవుతుందని, దాంతో తమని దెబ్బ తీసేందుకు వైసీపికి అవకాశం ఇచ్చిన్నట్లు రెండు పార్టీలు భావిస్తుండవచ్చు. కనుక ఏ పార్టీకి ఎన్ని సీట్లనే విషయమైనా ప్రకటిస్తే వాటిపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.
నేటికీ జనసేన అంటే పవన్ కళ్యాణ్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ అన్నట్లే సాగుతోంది. జనసేన సభలలో పవన్ కళ్యాణ్ ఒక్కరే మాట్లాడుతున్నారు. ఆ పార్టీలో ముఖ్య నాయకులు ఎవరినీ హైలైట్ చేయడం లేదు. దీంతో వారు ప్రజల దృష్టిలో ‘అనామకులు’గానే మిగిలిపోతున్నారు.
అందరికీ పరిచయమున్న టిడిపి, వైసీపి నేతలకే ప్రజలు మొగ్గు చూపుతారు తప్ప అనామక జనసేన అభ్యర్ధులవైపు మొగ్గు చూపరని తెలంగాణ ఎన్నికలలో కూడా మరోసారి రుజువైంది కదా?కనుక కనీసం ఇప్పటి నుంచయినా జనసేనలో మిగిలిన నేతలను, పోటీ చేయబోతున్న అభ్యర్ధులతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు విస్తృతంగా నిర్వహింపజేయడం చాలా మంచిది.




