జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ చేపట్టిన పోరాట యాత్రలో ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు కల్పించడం లేదని, ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే సర్కారే బాధ్యత వహించాల్సి వస్తుందని జనసేన పార్టీ తెలిపింది. పవన్‌కు పోలీసులు రక్షణ కల్పించకుండా ప్రభుత్వమే అడ్డుకుంటుందని సమాచారం అందిందని జనసేన ఉపాధ్యక్షుడు బి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
అయితే ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ప్రభుత్వం తనకు కేటాయించిన సెక్యూరిటీని తిరిగి పంపారు. పైగా వారు ప్రభుత్వం తరపున గూఢచర్యం చేస్తున్నారని ఆరోపించారు కూడా. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం భద్రత కలిపించడం లేదని ఆరోపణ. చూడబోతే ఏదో రకంగా ప్రభుత్వాన్ని విమర్శించాలనే తపనే ఎక్కువగా కనిపిస్తుంది.
అయితే పోలిసుల మాట మరో రకంగా ఉంది. “జనసేన పోరాట యాత్ర నిర్దిష్టమైన షెడ్యూల్ లో జరగడం లేదు. చివరి నిముషంలో పర్యటన వివరాలు ఖరారు చేస్తున్నారు. అప్పటికప్పుడు రూట్ మ్యాప్ మారుస్తున్నారు. దీనితో పోలీసు బందోబస్తు కష్టంగా మారుతుంది. ఇదే విషయం పార్టీ వారికీ తెలియజేశాం,” అని స్థానిక పోలీసులు వివరిస్తున్నారు.



