2024 ఎన్నికల నినాదంగా వైసీపీ ఎంచుకున్న వై నాట్ 175 వైసీపీ నిరంకుశత్వ రాజకీయానికి ప్రతిబింబంగా కనిపించింది. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమన్నదే లేకుండా చెయ్యాలన్న జగన్ ఆలోచన విధానాన్ని ఏపీ ఓటర్లు సమర్ధించలేదు సరికదా అసలు వైసీపీ కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తీర్పు ఇచ్చారు.
అలాగే నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో మీ ఆస్తికి జగనన్న రక్షా అంటూ రైతుల పాస్ పుస్తకాల మీద వేసిన జగన్ ఫోటో ను కూడా గ్రామీణ ప్రజలు స్వాగతించలేదు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు తో తెచ్చిన భూ చట్టాన్ని ప్రజలు తిప్పికొట్టారు.
ఇదంతా ఒక లెక్క రాజధాని కథ మరోలెక్క అన్నట్టుగా నాడు ముఖ్యమంత్రిగా అమరావతి పై జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వైసీపీ ని మూడు ప్రాంతాలలోను రాజకీయ సమాధి చేసింది. ఇక బాబు అరెస్టు, పవన్ నిర్బంధంతో అటు టీడీపీ ని ఇటు జనసేనను కట్టడి చేద్దాం అనుకున్న వైసీపీ అధికారాన్ని రాష్ట్ర ప్రజలు 11 తో కట్టడి చేసి చూపించారు.
ఇలా నాడు వైసీపీ తీసుకున్న విధానాలు, అందుకున్న నినాదాలు, వేసిన ప్రణాళికలు అన్ని కూడా కూటమి కి బలంగా మారాయి. ఇక తాజాగా రాష్ట్ర రాజధాని విషయంలో జగన్ ప్రతిపాదించిన మావిగన్ కూడా కూటమి కి భవిష్యత్ లో రాజకీయ బలాన్ని పెంచుతుంది అన్న భావన సర్వత్రా వినిపిస్తుంది.
ఇప్పటికే కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని అమరావతి నిర్మాణాల కోసం వెచ్చించిన ఈ తరుణంలో జగన్ మావిగన్ మా 2029 ఎన్నికల నినాదం అంటూ ప్రకటించడం వైసీపీ రాజకీయ సమాధికి పునాదులు తవ్వినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఒక్క అమరావతిని వ్యతిరేకించడం కోసం జగన్ ఇలా ఎప్పటికప్పుడు రాజధాని పేరు మీద మాటలు మార్చుకుంటూ ప్రకటనలు చేయడం వైసీపీ పతనానికి నాంది పలకడమే అవుతుందేమో. నాడు వై నాట్ 175 అన్న జగన్ అతివిశ్వాసాన్ని ఒక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెల్లాచెదురు చేసేసింది.
ఇక ఇప్పుడు వైసీపీ రప్ప రప్ప రాజకీయ అత్యాశలను, జగన్ 2.0 కోరికలను మావిగన్ బూడిద చేస్తుందేమో అన్న ఆందోళలన వైసీపీ శ్రేణులలో కూడా వ్యక్తమవుతోంది. కాకపోతే వారి అంతర్మధనాన్ని బహిర్గతం చేసే సాహసం ఎవ్వరు చెయ్యలేరేమో..!




