డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నేడు కోనసీమ జిల్లా రాజోలులో పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో రెండు అంశాలు ప్రధానంగా చెప్పుకోవలసి ఉంటుంది. 1. జన సైనికుల అత్యుత్సాహం, 2. సంక్షేమ పధకాలు అవసరం లేనంతగా రాష్ట్రాభివృద్ధి.
ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి కూడా పవన్ కళ్యాణ్ సినీ అభిమానులు, జన సైనికులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అలవాటు ప్రకారం ఆయన ప్రసంగం ప్రారంభించినప్పటి నుంచి వారు ఈలలు, కేకలు వేస్తూ హర్షధ్వానాలు చేస్తూనే ఉన్నారు.
అప్పుడు వారి అత్యుత్సాహం గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ప్రధాని మోడీ భద్రతని చూసే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ నాతో ఏమన్నారంటే, ప్రధాని మోడీ జమ్ము కాశ్మీర్‌లో పర్యటించినా మేము ఆయనకు రక్షణ కల్పించగలం. ఎటువంటి ఇబ్బందీ లేదు. కానీ ఏపీలో మీ సభలకు వచ్చినప్పుడు మీ వీరాభిమానులతో వేగలేకపోతున్నాము. వారి ఉత్సాహాన్ని తట్టుకోలేకపోతున్నామని చెప్పారు,” అన్నారు.
పవన్ కళ్యాణ్ ఈ విషయం చెపుతున్నప్పుడు కూడా జన సైనికులు ఈలలు, కేకలు వేస్తూ హర్షధ్వానాలు చేశారు. జన సైనికుల అత్యుత్సాహం ప్రధాని మోడీ సభకు ఇబ్బందికరంగా ఉందని పవన్ కళ్యాణ్ చెపుతుంటే, వారు అదేదో ప్రశంశ అన్నట్లు ఈలలు, కేకలు వేస్తూ హర్షధ్వానాలు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన పాయింట్ వారికి అర్ధం కాలేదనుకోవాలి.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ సభలో పాల్గొన్నా ఆయన మాట్లాడుతుంటే చెప్పింది చెవికెక్కించుకోకుండా అభిమానులు ఇలాగే ఈలలు కేకలు వేస్తుంటారు. నేడూ అలాగే చేశారనుకోవాలి.
అయితే పవన్ కళ్యాణ్ వారి అభిమానం వల్లనే వైసీపీని ఎదిరించి నేడు ఈ స్థాయికి చేరుకోగలిగామని వారికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. మీ చేతిలో జనసేన జెండా కర్ర కూడా తుపాకీలా పేలుతుందని మెచ్చుకున్నారు.
సంక్షేమ పధకాల గురించి మాట్లాడుతూ, “మన ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తోంది. కానీ అసలవి అవసరం లేనంతగా అభివృద్ధి జరగాలి. అందరూ ఉద్యోగాలు, ఉపాధి సంపాదించుకొని ఎవరి కాళ్ళపై వారు నిలబడాలి. సంక్షేమ పధకాలపై ఆధారపడేవారి సంఖ్య తగ్గించగలిగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు భావిస్తాను.
ఇందుకోసం యువతకు నైపుణ్యాలు పెంచుకునేందుకు మన ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది. కనుక మీలో ప్రతీ ఒక్కరూ నైపుణ్యం పెంపొందించుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మరో పది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు.
గత ప్రభుత్వం సంక్షేమ పధకాల కోసం ప్రజలందరూ ఎప్పటికీ ప్రభుత్వంపై ఆధారపడి ఉండాలని కోరుకుంది. చివరివరకు దాని పాలన అలాగే సాగింది. ఈ విధానం యువతని నిర్వీర్యం చేయడమే కార్యక్రమంలో, చాలా మంది అసాంఘిక శక్తులుగా మారేలా చేసింది. పైగా సంక్షేమ పధకాలు చేసిన అప్పుల భారం నేటికీ లబ్ధిదారులతో సహా రాష్ట్ర ప్రజలందరూ మోయక తప్పడం లేదు.
కనుక ఎవరి కాళ్ళపై వారు నిలబడాలి తప్ప ప్రభుత్వంపై ఆధారపడకూడదనే పవన్ కళ్యాణ్ మాట నూటికి నూరు శాతం కరక్టే!






