వైసీపీలు… దయచేసి తాట తీయించుకోవద్దు!

Pawan Kalyan warning YSRCP leaders

నేడు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం పెరవలిలో అమరజీవి జలధార పధకానికి డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, పార్టీ నేతలకు సూటిగా వార్నింగ్ ఇచ్చారు.

“తలకాయలు నరుకుతాము… అధికారులు, పారిశ్రామికవేత్తలను జైల్లో పెడతామంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీ ఫ్యాక్షన్ రాజకీయాలతో అందరినీ భయపెట్టాలనుకుంటే మేమూ అదే రీతిలో స్పందించాల్సి ఉంటుంది. యూపీ సిఎం యోగీ ఆదిత్యనాథ్ లా ఒక్కొకరి తాట తీసి మూల కూర్చోబెట్టాల్సి వస్తుంది జాగ్రత్త. చేజేతులా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు.

ADVERTISEMENT

మా సహనానికి ఓ హద్దు ఉంటుంది. మీ బెదిరింపులతో మా సహనం పూర్తిగా నశించిపోయింది. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెపుతున్నారు. కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీ బెదిరింపులకు భయపడలేదు. ఇప్పుడు భయపడతామా?

కొంతమందిని పోగేసుకొని రోడ్లపైకి వచ్చి ప్రజలను, అధికారులను భయపెడతామంటే చూస్తూ ఊరుకోవాలా? రాజకీయాలలో మాటా మాటా అనుకోవడం సహజమే. కానీ ఇలా అందరినీ బెదిరించి బయపెట్టి రాజకీయాలు చేద్దామనుకుంటే కుదరదు.

నేనూ, సిఎం చంద్రబాబు నాయుడుగారు పోలీస్ అధికారులతో సమావేశమైనప్పుడు మీ విషయం పదేపదే ప్రస్తావనకొస్తోంది. రాష్ట్రంలో అనేక మంది పోలీస్ ఉన్నతాధికారులున్నారు. లక్షల మంది పోలీసులున్నారు. మేము రాజకీయ నిర్ణయం తీసుకొని ఒక్క ఆదేశం ఇస్తే మీ అందరి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి.

ఇకనైనా మీ పద్దతి మార్చుకోండి. ప్రజా సమస్యలపై మమ్మల్ని నిలదీయాలనుకుంటే గట్టిగా నిలదీయండి కానీ ఇలా ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తామంటే కుదరదు,” అని డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.

వైసీపీ నేతలు కూడా ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తుంటారు. కనుక వారు పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరికలపై ఏవిధంగా స్పందిస్తారో ఊహించవచ్చు.

వారి ధైర్యానికి బలమైన కారణమే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం కేసుతో వైసీపీ నేతలపై డజన్ల కొద్దీ కేసులు నమోదు చేసింది. కానీ 18 నెలల్లో ఏ ఒక్క కేసులో కూడా ఎవరిని ఏమీ చేయలేకపోయింది. మహా అయితే అరెస్ట్‌ చేసి ఓ రెండు మూడు నెలలు జైల్లో పెట్టగలదు. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చేయవచ్చు.

అక్కడితో ఆ కేసు సమాప్తం… తమని ఏ చట్టం, న్యాయస్థానం, ప్రభుత్వం ఏమీ చేయలేదనే ధీమాయే వైసీపీ చెలరేగిపోయేలా చేస్తోందని చెప్పవచ్చు. కనుక బంతి కూటమి ప్రభుత్వం కోర్టులోనే ఉందని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories