ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీతో రీ-ఎంట్రీ ఇస్తుండటంతో రాజకీయ సమీకరణాలు, బలాబలాలు మారిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నా చెల్లెళ్ళ మదే ఎలాగూ రేసు మొదలవుతుంది. అయితే ఏదో రోజు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతానని నమ్మకంగా చెపుతున్న పవన్ కళ్యాణ్ కూడా ఈ రేసులో ఉన్నట్లే అనుకుంటే వీరు ముగ్గురూ ఈ రేసులో ఎంతెంత దూరం పరిగెత్తగలరు?ముగ్గురిలో ఎవరు రేసులో గెలుస్తారు? అని ఆలోచిస్తే, ముందుగా జగన్మోహన్ రెడ్డితోనే మొదలుపెట్టవలసి ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి: తాను మరో 30 ఏళ్ళు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి కోరుకొంటున్నారు. అంతవరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏపీ మిగిలి ఉంటుందో లేదో తెలీదు. అది వేరే సంగతి. ముందుగా త్వరలో జరుగబోయే ఎన్నికలలో గెలవాల్సి ఉంటుంది.
కనుక తప్పనిసరిగా వైఎస్ షర్మిలని ధీటుగానే ఎదుర్కోవలసి ఉంటుంది. ఎదుర్కొంటారు కూడా. ఆమె సొంత చెల్లి కనుక ఆమెను ఏవిదంగా ఎదుర్కోవాలనే దానిపై ఇప్పటికే పార్టీలో మేధోమధనం చేస్తూనే ఉంటారు. కనుక త్వరలోనే సజ్జల రామకృష్ణా రెడ్డి పార్టీ నేతలకు ఆ లైన్ ఇస్తారు. ఆ ప్రకారం ఎదురుదాడి మొదలుపెట్టేస్తారు.
అయితే ఈ యుద్ధం అంతం కాదు ఆరంభం మాత్రమే. ఒకవేళ ఈసారి ఎన్నికలలో వైసీపి గెలిస్తే, షర్మిలకు ఏదైనా బంపర్ ఆఫర్ ఇచ్చి, రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడకుండా అడ్డుకొనే ప్రయత్నం చేయవచ్చు. కానీ ఓడిపోతే టిడిపి, జనసేనల వాటి నుంచి తనను కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి అత్యవసరంగా ఓ రక్షణ కవచం అవసరం ఉంటుంది. కనుక కుదిరితే ఎన్డీయే కూటమిలో చేరిపోవచ్చు.
ఈసారి ఎన్నికలలో జగన్ ఓడిపోతే భవిష్యత్‌లో వైసీపిని కాంగ్రెస్‌లో విలీనం చేసేయవచ్చని అప్పుడే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు వైసీపి కాంగ్రెస్‌లో విలీనం అయ్యేందుకు షర్మిల ఒప్పుకోకపోవచ్చు. ఒప్పుకొంటే ఆమె రాజకీయ జీవితం మళ్ళీ మొదటికొస్తుంది. వైసీపిని కాంగ్రెస్‌లో విలీనం కానిస్తే ఆమె కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది. కనుక జగన్, షర్మిలలో చివరికి ఎవరు పైచేయి సాధిస్తారనేది ఎన్నికల తర్వాత కొంత స్పష్టత వస్తుంది.




