ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ ‘భూసర్వే, క్రెడిట్ చోరీ, సర్వేరాళ్ళు, పట్టాదారు పుస్తకాలపై జగన్ ఫోటోలు. కానీ దీని మూలాల గురించి ఎవరూ చర్చించడం లేదు. ఎందుకంటే, ఈ సమస్యతో బాధపడుతున్న, నష్టపోయిన రైతులకు మాత్రమే అది అర్ధమవుతుంది. మిగిలిన సామాన్య ప్రజలకు అర్థం కాదు.
కనుక ప్రజలందరూ సులువుగా కనెక్ట్ అయ్యే ‘మసాలా’ అంశాలను మాత్రమే తీసుకొని రెండు పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. అవి ఊహించినట్లే ‘బొమ్మ’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
అయితే ఉన్నత విద్యావంతుడు, తొలిసారిగా కేంద్రమంత్రి పదవి చేపట్టిన డా.పెమ్మసాని చంద్రశేఖర్ సంక్లిష్టమైన ఈ అంశాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టిన్నట్లు అందరికీ అర్ధమయ్యేవిధంగా వివరించారు. ముందుగా ఆయన చెప్పిన పాయింట్స్:
1. జగన్ హయంలో భూసర్వే, రీసర్వే జరిగిన మాట వాస్తవం. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన కార్యక్రమం.
2. కనుక ఏ రాష్ట్రమైనా సర్వే, రీసర్వే చేసి ఆ రికార్డులు సమర్పిస్తే కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఇన్సెంటివ్ ఇస్తుంది.
3. కానీ జగన్ దాని కోసం దరఖాస్తు చేయలేదు. ఎందుకంటే ఈ సర్వే, రీసర్వేలో 2,79,712 వివాదాలున్నాయి. వాటిలో భూమి కొలతలు, సరిహద్దుల కేసులు 99,000 ఉన్నాయి. కుటుంబ సభ్యుల మద్య లేదా ఇతరుల మద్య భూముల వివాదాలు 64,000 కేసులు, రెవెన్యూశాఖ వలన ఏర్పడిన కేసులు 1,14,000 కేసులు ఉన్నాయి. వీటన్నిటినీ జగన్ ప్రభుత్వం పరిష్కరించలేక చేతులెత్తేసింది. అందువల్లే ఇన్సెంటివ్ కోసం దరఖాస్తు చేసుకోలేదు.
4. కానీ ప్రచార యావతో రూ. 690 కోట్లు (ప్రజాధనం) ఖర్చు చేసి పట్టాదారు పాసు పుస్తకాలపై, సర్వే రాళ్ళపై తన బొమ్మలు వేయించుకొని రైతులకు పంచిపెట్టారు.
5. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.500 కోట్లు ఇన్సెంటివ్ ఎందుకు వదులుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పలుమార్లు గ్రామ సభలు నిర్వహించి, ఈ కేసులన్నీ ఒకటొకటిగా పరిష్కరించింది. ఈ రికార్డులన్నీ కేంద్రానికి సమర్పించి రూ. 500 కోట్లు ఇన్సెంటివ్ తీసుకుంది… అని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.
అయితే సర్వే, రీసర్వే క్రెడిట్ చోరీ గురించి జగన్‌తో సహా వైసీపీ నేతలు చేస్తున్న వితండవాదానికి కూడా ఆయన చక్కగా సమాధానం చెప్పారు. అదీ క్లుప్తంగా చెప్పుకుంటే…
1. జగన్ ప్రభుత్వమే ఈ సర్వే, రీసర్వే పూర్తిచేసి ఉంటే ఈ క్రెడిట్ పూర్తిగా ఆయనకే దక్కి ఉండేది. కానీ అయనకు ప్రచార యావ, ఓటు బ్యాంకు రాజకీయాలపై ఉన్నంత శ్రద్ధ రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యల పరిష్కారంపై లేదు.
2. ఆ యావతో తన ఫోటోలు వేయించుకోవడంతో రైతులకు ఆగ్రహం కలిగింది. తన ఫోటోతో ఎన్నికలలో గెలిచేయవచ్చని జగన్ అనుకుంటే సరిగ్గా ఇదే కారణంగా ఓడిపోయారు.
3. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’తో తమకు తీరని అన్యాయం, నష్టం జరుగుతుందని రైతులు మొత్తుకున్నారు. టీడీపి, జనసేనలు కూడా దానిని తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ జగన్ వినలేదు.
4. అది అమలులోకి వస్తే రైతుల భూయాజమాన్యాన్ని ధృవీకరించే ఒరిజినల్ డాక్యుమెంట్లని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. వాటి జిరాక్సు కాపీలు మాత్రమే రైతుల వద్ద ఉంటాయి. భూవివాదాలు ఏర్పడితే తీర్పు చెప్పే అధికారం తహసీల్దారులకి లేదా హైకోర్టుకి మాత్రమే ఉంటుంది. జిల్లా స్థాయి కోర్టులు కలుగజేసుకోలేవు. కనుక ఇదీ రైతుల ఆగ్రహానికి మరో కారణమైంది. వారి ఆగ్రహానికే జగన్ బలైపోయారు.
5. రైతులకు నష్టం కలుగుతుందని తెలుసు గనుకనే సిఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టగానే దానిని రద్దు చేశారు.
కానీ నేటికీ తాను చేసింది కరక్టే అని జగన్ వాదిస్తున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో ప్రజలు మళ్ళీ తనను ఎన్నుకున్నట్లయితే మళ్ళీ నా బొమ్మలు వేయించుకుంటానని, మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకు వస్తానని జగన్ చెప్పుకోవాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సవాలు చేశారు.






