కేసులు కేవలం ప్రత్యర్దుల కట్టడి కోసమేనా?

Phone Tapping Case: Political Strategy in Telangana

అలనాడు పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి పెట్టారు. అజ్ఞాతం ముగిసిన తర్వాత కిందకు దించి వాటితో యుద్ధం చేసి గెలిచారు. మన దేశంలో అధికార పార్టీలన్నీ కూడా కేసుల విషయంలో ఇదే విధానం అవలంభిస్తున్నాయి.

పాండవులు వాటితో ఒక్కసారే యుద్ధం చేసి కౌరవులను మట్టుబెట్టి విజయం సాధించారు. కానీ మన దేశంలో అధికార పార్టీలు వారి కంటే చాలా తెలివిగా వాడుకుంటున్నాయి.

ADVERTISEMENT

ఆ కేసులను అవసరమైనప్పుడు కిందకు దించుతూ పని పూర్తికాగానే మళ్ళీ పైన పెట్టేస్తుంటాయి. తద్వారా వాటితో ప్రత్యర్ధులని కట్టడి చేస్తున్నాయే తప్ప అవినీతికి పాల్పడిన వారికి శిక్షలు పడేలా చేయడం లేదు.

ఒకవేళ చేయాలనుకున్నా కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్ళు, రాష్ట్రంలో రాజకీయ అవసరాలు, లెక్కలు అన్నీ చూసుకొని వెనక్కు తగ్గాల్సి వస్తోంది.

దీనికి చక్కటి ఉదాహరణగా తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి చెప్పుకోవచ్చు. తెలంగాణలో ప్రభుత్వం మారగానే బయటపడిన ఆ కేసు రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించింది.

తెలంగాణ ప్రభుత్వం కూడా దాంతో చాలా హడావుడి చేసింది. నేడో రేపో ఆ కేసులో మాజీ సిఎం కేసీఆర్‌తో సహా పలువురు కీలక నేతలు జైలుకి వెళ్ళడం ఖాయమని చాలా మంది అనుకున్నారు.

కానీ హటాత్తుగా ఆ కేసు విచారణకి బ్రేకులు పడి దాదాపు ఏడాదిపాటు ఆగిపోయింది. మళ్ళీ మొన్న దానిలో కదలిక వచ్చింది. మాజీ సిఎం కేసీఆర్‌ వద్ద ఓఎస్‌డీగా పనిచేసిన మాజీ అధికారి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు నిన్న సుమారు రెండు గంటలు ప్రశ్నించారు.

కేసీఆర్‌ని అరెస్ట్‌ చేయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. కనుక ఇప్పుడీ కేసులో కదలిక రాగానే ఏదో జరిగిపోతుందని ఎవరూ అనుకోవడం లేదు.

మరెందుకీ హడావుడి? అంటే ‘జమ్మి చెట్టు మీదున్న అస్త్రాలను యుద్ధం చేయడానికే దించుతుంటారని’ ముందే చెప్పుకున్నాము. వచ్చే నెలలో గ్రామ పంచాయితీ ఎన్నికల యుద్ధం జరుగబోతోంది. బహుశః దాని కోసమే దించి ఉండవచ్చు.

కాదనుకుంటే, ఈ కేసులో కేసీఆర్‌ని, ఎఫ్‌-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌ని అరెస్ట్‌ చేయాలి. కానీ సాధ్యం కాదని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెపుతున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ కూడా రేవంత్ రెడ్డి వల్ల కాదనే చెపుతున్నారు.

కనుక ఎన్నికలు (యుద్ధం) ముగియగానే మళ్ళీ కేసు ఫైల్స్ (ఆయుధాలు) కట్ట కట్టి అటక (జమ్మి చెట్టు)మీద పెట్టేయవచ్చు.

ADVERTISEMENT
Latest Stories