రాజకీయ పార్టీలకు వాటి నాయకులకు ఓ నిర్శిష్టమైన ఆలోచన, సిద్దాంతం, విధానం, వైఖరికి కట్టుబడిఉందాలి. ఒకవేళ వీటిలో ఏదైనా మార్పు చేసుకోదలిస్తే అది కూడా పారదర్శకంగా ఉండాలి. దానికి ఓ బలమైన కారణం ఉండాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. ఈ విశ్వసనీయత కోల్పోతే పతనం తప్పదు.
ఉదాహరణకు ఇదివరకు టీడీపి.. దాని అధినేత చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా కోసమంటూ ప్రధాని మోడీపై కత్తులు దూశారు. ఆ యుద్ధం వెనుక వేరే రాజకీయ కారణాలు ఉండవచ్చు.
కానీ ఆయనలో ఈ ఆకస్మిక మార్పుని ప్రజలు ఆమోదించలేదు. దాంతో అయన విశ్వసనీయత దెబ్బ తింది. ఇదే అదునుగా ఆయన రాజకీయ శత్రువులందరూ చేతులు కలిపారు. చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయారు.
అదే చంద్రబాబు నాయుడు.. 2024 ఎన్నికలకు ముందు మళ్ళీ ప్రధాని మోడీ, బిజేపితో చేతులు కలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తులు అని వారు చెప్పిన మాటని ప్రజలు నమ్మారు. అప్పటికే జగన్ విశ్వసనీయత కోల్పోయారు. కనుక ప్రజలు చంద్రబాబు నాయుడుని మళ్ళీ గెలిపించారు.
అంటే రాజకీయాలలో ఉన్నవారికి విశ్వసనీయత ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. అది ఉంటే అధికారంలో, కోల్పోతే ప్రతిపక్షంలో ఉంటారు.
ఇప్పుడీ ‘విశ్వసనీయత స్టోరీ’ దేనికంటే, కల్వకుంట్ల కవిత నిన్న శాసనమండలిలో తన తండ్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, ఆ ప్రభుత్వం, పాలనపై చాలా లోతైన విమర్శలు, తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు.
ఇంతకాలం మౌనం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెపై అంతే లోతైన, తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసింది. ఇరు పక్షాలు చేసుకున్న ఈ విమర్శలు, ఆరోపణలతో కేసీఆర్‌తో సహా బీఆర్ఎస్ పార్టీలో అందరూ అవినీతికి పాల్పడ్డారని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పగలిగారు.
ఉదాహరణకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో తాను అవినీతికి పాల్పడలేదని కేసీఆర్ మీద కక్షతోనే మోడీ తనని అరెస్ట్ చేయించారని కవిత మండలిలో మరోసారి చెప్పారు.
కానీ ఆ కేసుతోనే ఢిల్లీ మాజీ సిఎం కేజ్రీవాల్‌కి కూడా అవినీతి మరకలు అంటించి ఆయన పతనానికి కారణం అయ్యావు కదా కవితా? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. అంటే ఆ కేసులో ఆమె అవినీతికి పాల్పడ్డారని చెప్పినట్లే కదా?
ఆమెను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించారని, అందుకోసం బీఆర్ఎస్ పార్టీని బిజేపిలో విలీనం చేసేందుకు సిద్ధపడ్డారనే విషయం వారి వాదోపవాదాలతోనే బయటపడింది తప్ప మోడీ లేదా మరొకరు చెప్పలేదు కదా?
అంటే నేటికీ కేసీఆర్ ఎవరిని తెలంగాణ శత్రువులుగా చూపిస్తూ కత్తులు దూశారో వారితోనే కలిసిపోయేందుకు సిద్దపడ్డారన్న మాట! అవన్నీ చాలా గొప్ప రాజకీయ వ్యూహాలని, అవి తన రాజకీయ చతురతకి నిదర్శనమని కేసీఆర్ బలంగా నమ్అమారు. పార్టీ నేతల చేత ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ వాటితోనే తాను విశ్వసనీయత కోల్పోతున్నానని ఓడిపోయే వరకు గ్రహించలేకపోయారు.
ఈ అవినీతి భాగోతాలు, తెర వెనుక జరిగిన ఈ రాజకీయాలన్నీ కేసీఆర్ ఓటమి తర్వాత మెల్లమెల్లగా బయటపడి ఉండవచ్చు. కానీ ప్రజలు, కేసీఆర్‌నే నమ్ముకున్న పార్టీ నేతలు, పార్టీ కార్యకర్తలు తెర వెనుక జరిగిన ఈ రాజకీయాలను అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువవారు కారు. కేసీఆర్ వారందరి నమ్మకాన్ని కోల్పోవడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ పతనమైందని చెప్పక తప్పదు.
అయితే చంద్రబాబు నాయుడు-మోడీ చేతులు కలిపారు కదా? మరి వారు విశ్వసనీయత ఎందుకు కోల్పోలేదు? అంటే వారు బహిరంగంగా, పారదర్శకంగా చేతులు కలిపారు. దానికి రాష్ట్ర ప్రయోజనాలనే బలమైన కారణం ఉందని ప్రజలు నమ్మారు. కనుకనే అధికారం కట్టబెట్టారు.
కానీ కేసీఆర్ తన కుటుంబం, పార్టీ అవసరాలు, ప్రయోజనాల కోసం రాష్ట్రంలో కాంగ్రెస్, బిజేపిలతో పోరాడుతూ తెర వెనుక ఓసారి కేంద్రంతో మరోసారి మజ్లీస్ పార్టీతో, చివరికి కాంగ్రెస్ నేతలతో కూడా రాజకీయాలు చేశారు. నేటికీ ఆయన ఇలాంటి డబుల్ గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. కనుక ఫలితాలు లేదా పర్యవసనాలు అలాగే ఉండవచ్చు.






