సిఎం చంద్రబాబు నాయుడు నిన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతి పరిశీలించిన తర్వాత సంబంధిత మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ హయంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో జగన్ చేసిన ఆకృత్యాల గురించి వివరించిన తర్వాత ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.
“జగన్ హయంలో జరిగిన అవినీతి, అక్రమాలకు అంతే లేదు. వాటన్నిటిపై కేసులు నమోదు చేసి విచారణ జరిపిస్తే మరో 30 ఏళ్ళు పడుతుంది. వాటితో పట్టిపడుతూ కూర్చుంటే అభివృద్ధి పనులన్నీ నిలిచిపోతాయి. కనుక జగన్ హయంలో భారీగా అవినీతి జరిగిందని తెలిసి ఉన్నా, వాటన్నిటినీ పక్కన పెట్టి ముందుకు సాగాల్సివస్తోంది,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే విధంగా అన్నారు. కేసీఆర్ హయంలో జరిగిన అవినీతి, అక్రమాల కేసులన్నీ తవ్వితీసి విచారణ జరిపించడం మొదలుపెడితే ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ స్తంభించిపోతాయని తెలిపారు.
కనుక ముఖ్యమైన రెండు మూడు కేసులపై మాత్రమే విచారణ జరిపిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారంలో ఉన్నవారు చిలక్కొట్టుళ్ళతో సరిపెట్టుకుంటే తర్వాత కేసులలో చిక్కుకొని జైలు పాలవుతారు. కానీ ఎంత ఎక్కువ అవినీతికి పాల్పడితే అంత సేఫ్ అన్నమాట!
అవినీతికి పాల్పడినవారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేని ఇటువంటి నిసహాయ పరిస్థితి కల్పించి, తప్పించుకోవచ్చనే ఈ కొత్త ఫార్ములా దిగ్భ్రాంతి కలిగిస్తోంది కదా?






