రోడ్డు పక్కన చిలక జోస్యం కావచ్చు లేదా మోస్ట్ ఫేమస్ జ్యోతిష్యుడు కావచ్చు… ఎవరైనా వారి వద్దకు ఎందుకు వెళతారంటే తమ కోరికలు తీరుతాయా లేదా తమ సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా?
తాము కోరుకున్నట్లు అన్నీ జరుగుతాయా లేదా?
తమ ఉద్యోగం, ఆరోగ్యం, పెళ్ళి, ఇళ్ళు, వాహనాలు సమకూర్చుకోవడం వంటి విషయాలను తెలుసుకోవాలనే జోస్యం చెప్పించుకోవడానికి వారి వద్దకు వెళుతుంటారు.
ఈ విషయం వారికి కూడా బాగా తెలుసు. కనుకనే తమ తెలివి తేటలు, వాక్చాతుర్యాన్ని బట్టి తదనుగుణంగా ఎదో చెప్పి జీవనోపాధి పొందుతుంటారు.
రాజకీయాలలో ఐ-ప్యాక్, సొంత మీడియా, అనుకూల మీడియా కూడా ఇదేవిధంగా పనిచేస్తుంటాయి. అధినేతల కళ్ళలో ఆనందం కోసం 175కి 175 మనకే అని నమ్మించవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మనకే మెజార్టీ అని చెప్పొచ్చు. ఈసారి బీహార్ ఎన్నికలలో మనమే అని చెప్పొచ్చు.
ఇక రాబోయేది రాజయోగమే… అంతా రాజభోగమే అని నమ్మిస్తుంటాయి. అధినేతల కళ్ళలో ఆనందం కోసం తాన అంటే తందాన అంటూ మబ్బుల్లో తేలిపోయేలా చేస్తుంటాయి. అలా మబ్బులో తేలిపోతూ సాగిపోతుంటే ఎన్నికలొచ్చేసరికి ఆ మబ్బులు చెదిరిపోతాయి. అప్పుడు అంతపై నుంచి కిందన పడిపోతారు. అప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా కాపాడలేనని చెప్పేసి వెళ్ళిపోతారు. సరిగ్గా ఇలాగే కేసీఆర్, జగన్… వారిని నమ్ముకున్నవారందరూ బోర్లా పడ్డారు.
కనుక రాజకీయాలలో కావలసింది మనకు ఇష్టమైనవి చూపించే మాయాబజార్‌లోని మాయా దర్పణం కాదు… మనసు పొరల్లో దాగున్న సత్యాలను వెలికితీసే సత్య పీటం.
ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావుని పొగడ్తలకు పడిపోకుండా అప్రమత్తం చేసేందుకు పెట్టుకున్న మృదంగం వంటి మీడియా కావాలి.
కానీ ఎవరూ కూడా మన లోపాలను, చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తే భరించలేరు. ముఖ్యంగా అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు.
కనుక సొంత మీడియా, అనుకూల మీడియా, చుట్టూ కోటరీలు, తమ తప్పులను ఎత్తి చూపేవారిపై ఎదురుదాడులు చేసేందుకు సోషల్ మీడియా వారియర్స్ ఇలా అనేక అంచెల కంచెలు ఏర్పాటు చేసుకొని దానిలో బందీలవుతారు. ‘ఆల్ ఈజ్ వెల్’ పాట వినడానికే ఎక్కువ ఇష్టపడతారు.
అదే… వారు ఎల్లో, బ్లూ, గ్రీన్ సిగ్నల్, రెడ్ అంటూ ముద్రలు వేసి పక్కన పడేస్తున్న మీడియాలో తమ తప్పొప్పులు, లోపాలు, వైఫల్యాలు గురించి తెలుసుకొని ఎప్పటికప్పుడు చక్కదిద్దుకుంటే 175కి 175 తప్పకుండా వస్తాయి.
అంటే విద్యార్ధులు ఏడాదంతా టీచర్లు చెప్పే పాఠాలు బుద్ధిగా విని, చక్కగా హోం వర్క్ చేసి పరీక్షలలో 100కి 100 మార్కులు సాధించినట్లన్న మాట!
ఇంతకీ విషయం ఏమిటంటే, వైసీపీ హయంలో టీడీపి కార్యాలయాలపై దాడులు జరిగినందుకు టీడీపి నేతలు చాలా బాధ పడ్డారు. అలా చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. చట్ట ప్రకారం పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కనుక టీడీపి కూడా అటువంటి తప్పు చేయకూడదు కదా?
శనివారం హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై కొందరు దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు. వారందరూ టీడీపి గూండాలేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తమ కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తాము పోలీసులకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళుతుంటే అడ్డుకున్నారని, తిరిగి తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని వైసీపీ నేత సతీష్ రెడ్డి ఆరోపించారు.
ఈ ఘటన గన్నవరంలో టీడీపి కార్యాలయంపై దాడి ఘటన కళ్ళ ముందు మెదిలేలా చేస్తుంది. అప్పుడూ అచ్చం ఇలాగే జరిగింది కదా? వారి దాడిని అడ్డుకొని పోలీసులు పిర్యాదు చేయడానికి వచ్చిన పట్టాభిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వేధించడం టీడీపి నేతలకు బహుశః గుర్తుండే ఉంటుంది కదా?
కనుక ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు టీడీపి కూడా అదేవిధంగా ప్రవర్తించడాన్ని ఏవిదంగా సమర్ధించుకోగలదు? ఒకవేళ వైసీపీ కార్యాలయం టీడీపి శ్రేణులు దాడి చేయకపోయి ఉంటే, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దాడి చేసినవారిని గుర్తించి అరెస్ట్ చేయాలి కదా?
ఒకవేళ టీడీపి శ్రేణులే ఈ పొరపాటు చేసి ఉంటే సిఎం చంద్రబాబు నాయుడు వారిపై తగిన చర్యలు తీసుకుంటే, అది ఓ మంచి సాంప్రదాయం అవుతుంది. ప్రజలు కూడా హర్షిస్తారు.
లేకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, ప్రతిపక్షాన్ని అణచివేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించాకుండా ఉంటారా? వాటి వలన ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడకుండా ఉంటుందా? ఏర్పడితే దానిని పెంచి పోషించడం వైసీపీకి తెలియదా?




