ఒక ప్రభుత్వ విధానాలు, తీసుకున్న నిర్ణయాలు అన్నీ సవ్యంగా ఉంటాయని గ్యారెంటీ లేదు. అలాగని అన్నీ తప్పేననడం కూడా తప్పే.
రాజకీయంగా విభేదిస్తున్నందున ఒక ప్రభుత్వం చేసే ప్రతీ పనిని ప్రతిపక్షాలు విమర్శించడం వరకు అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ నిర్ణయాలన్నిటినీ పక్కన పెడితే ఆ రాష్ట్రం ఎంతగా నష్టపోతుందో అర్థం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఒక చక్కటి ఉదాహరణ. ఈ స్టోరీ గురించి అందరికీ తెలుసు కనుక ఇప్పుడాచర్చ అనవసరం.
తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత అక్కడా ఇలాగే జరుగుతోంది. కేసీఆర్ హయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం, ‘టిఎస్’ స్థానంలో ‘టిజిఎస్’ మొదలుకొని ధరణి పోర్టల్ వరకు అన్నీ మార్చేసింది.
బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగానే వాటన్నిటినీ తొలగించి మళ్ళీ పాతవి ఏర్పాటు చేస్తామని కేసీఆర్ పదేపదే చెపుతున్నారు.
ఈ రెండు పార్టీల రాజకీయాల కోసం చేస్తున్న ఈ మార్పులు చేర్పులతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేకపోయినా వాటి భారం వారిపైనే పడుతుంది కదా?
కేసీఆర్ ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుని రేవంత్ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. మరమత్తులు చేయకుండా మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నిలువ చేసి ఉపయోగిస్తే ప్రాజెక్ట్ మొత్తం కూలిపోతుందని రేవంత్ ప్రభుత్వం వాదిస్తోంది.
కానీ ఈ పేరుతో కేసీఆర్‌కి అవినీతి మరకలు అంటించడానికి, ఆయన పేరు తుడిచిపెట్టేయడానికే అలా చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది.
కాళేశ్వరం విషయంలో రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా?అనేది అక్కడి పార్టీలు, ప్రజలు నిర్ణయించుకోవాలి.
కానీ బీఆర్ఎస్ పార్టీ మద్యలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పేరుని కూడా ప్రస్తావిస్తూ, ఆయన ఆడమన్నట్లుగానే ఆడుతూ ప్రాజెక్టు పాడుబెట్టేసి దిగువకు నీళ్ళు వదిలేస్తున్నారని ఆరోపిస్తోంది. అంటే దీనిపై రేవంత్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కూడా రాజకీయాలు చేస్తోందని అర్ధమవుతోంది. ఇటీవల బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కూడా రాజకీయ మైలేజ్ కోసం రెండు పార్టీలు ఇలాగే చేశాయి. ఇక ముందు కూడా చేయబోతున్నాయి.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం 33 జిల్లాలలను మళ్ళీ 17 లేదా 20కి కుదించాలని నిర్ణయించింది. గతంలో కేసీఆర్ తమ పార్టీ, నేతలకు ప్రయోజనం కలిగేవిధంగా అశాస్త్రీయంగా జిల్లాలు ఏర్పటు చేశారని రేవంత్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కనుక జ్యూడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసి లోతుగా అధ్యయనం చేసిన తర్వాత జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపడుతామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
రేవంత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కేటీఆర్ వెంటనే ఖండించారు. ఒక్క జిల్లాని ముట్టుకున్నా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇవన్నీ చూస్తుంటే, ఇదివరకు జగన్ హయంలో ఏపీలో ఏం జరిగిందో అదే ఇప్పుడు, భవిష్యత్‌లో కూడా తెలంగాణలో జరుగు(బో)తున్నట్లు అర్ధమవుతుంది. కనుక ఇలాంటి రాజకీయ ప్రయోగాలతో ఏపీ ఏవిధంగా నష్టపోయిందో తెలంగాణ కూడా అలాగే నష్టపోక తప్పదా? అని సందేహం కలుగుతుంది.






