చేసిన పనులు చెప్పుకుంటే చాలు… ప్రమోషన్స్ వద్దు!

Nara Lokesh supporters performing milk abhishekam for his portrait amid Andhra Pradesh political promotion debate

ఓ సినిమా సక్సస్ కావాలంటే ప్రమోషన్స్ చాలా అవసరం. అయితే ప్రభుత్వాలు వాటిని నడిపించే రాజకీయ పార్టీలు కూడా ఇదే పంధాలో సాగుతుండటం విశేషం. ముఖ్యమంత్రి, మంత్రులు మొదలు ఎమ్మెల్యేల వరకు, అలాగే ప్రతిపక్ష నేతలు కూడా తమని తాము ప్రమోట్ చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తుంటారు.

ప్రజలను ఆకట్టుకోవడానికి చేస్తున్న ఈ సెల్ఫ్ ప్రమోషన్స్‌ క్రమంగా అతిగా మారడంతో ప్రజలకు అసహనం కలుగుతోందనే గ్రహించడం లేదు.

ADVERTISEMENT

ఉదాహరణకి చిత్ర పటాలకు పాలాభిషేకాలు, ఓ మనిషి మోయలేనంత గజమాలలను క్రేన్ సాయంతో ఏర్పాటు చేసుకొని దాని మద్యలో నిలబడి ఫోటోలు దిగడం, తెలంగాణ గాంధీ, తెలంగాణ జాతిపిత, అపర భగీరధుడు వంటి సొంతగా బిరుదులు తగిలించుకొని వాటిని ప్రజలే ఇచ్చారని చెప్పుకోవడం వంటి అనేకం ఉన్నాయి.

సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అభివృద్ధి పనులు జోరుగానే సాగుతున్నాయి. అనేక సంక్షేమ పధకాలు కూడా అమలవుతున్నాయి. కనుక వాటి గురించి చెప్పుకోవడం తప్పు కాదు.

కానీ వాటిని చేస్తున్నందుకు పాలాభిషేకాలు, భజన బృందాలు సరికాదు. చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ ఎవరినీ ఆవిధంగా చేయమని ప్రోత్సహించరు. వారి పార్టీ నేతలో, కార్యకర్తలో, మద్దతుదారులో చేస్తుంటారు.

అయితే వైసీపీ కార్యకర్తలు రప్పారప్పా అంటూ అతి చేస్తున్నప్పుడు ప్రజలు వారినీ, వారి అధినేత జగన్మోహన్ రెడ్డిని ఏవిధంగా ఏవగించుకుంటున్నారో, అదేవిధంగా తమని ఎవగించుకుంటారని టీడీపి, జనసేన, బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ తదితర పార్టీల నేతలు, అధినేతలు, కార్యకర్తలు కూడా గ్రహించడం చాలా అవసరం.

ఇంతకీ విషయం ఏమిటంటే, రాష్ట్రంలో విద్యార్ధుల రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ చొరవ వల్లనే నిధులు విడుదలయ్యాయంటూ సోషల్ మీడియాలో టీడీపి ప్రచారం చేసుకుంటోంది.

ఈరోజుల్లో రాజకీయాలలో ఇటువంటి ప్రచారం సర్వసాధారణ విషయంగానే పరిగణిస్తున్నాము. అలాగే టీడీపి అనుబంధ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన చిత్ర పటానికి రోడ్లపై పాలాభిషేకాలు చేశారు.

నారా లోకేష్‌ ఇప్పటికే మంచి సమర్ధుడైన మంత్రిగా ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నారు. కనుక ఆయనకు ఇలాంటి చవుకబారు ప్రమోషన్స్ అవసరమే లేదు. కానీ ఆయన మెప్పు కోసం కొందరు చేస్తున్న ఇటువంటి పనులతో ప్రజలలో అసహనం కలుగవచ్చు. వైసీపీ లేదా మరొకరు వేలెత్తి విమర్శించవచ్చు. కనుక ఇలాంటి వారిని, వాటిని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌ వారించడం మంచిది.

ADVERTISEMENT
Latest Stories