ఏపీలో వైఎస్ఆర్, తెలంగాణలో బిఆర్ఎస్ రెండు పార్టీల పుట్టుక వెనుక బయటకు కనిపించే కారణం ఒకటైతే, అసలు అంతర్గతంగా వినిపించే వాస్తవం మరొకటి అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించే మాట.
అయితే ముందుగా తెలంగాణలోని బిఆర్ఎస్ విషయానికొస్తే, ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో రాజకీయ అరంగేట్రం చేసి అక్కడ మంత్రి పదవి దక్కలేదనే అక్కసుతో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఒక రాజకీయ పార్టీకి జీవం పోశారు. అయితే ఇక్కడ తెరాస పుట్టుకకు బయటకు కనిపించే కారణం “ప్రత్యేక తెలంగాణ” కాగా టీడీపీలో కేసీఆర్ కు మంత్రి పదవి దక్కపోవడమే అసలు వాస్తవం అనేది అంతర్గత టాక్.
ఇక ఏపీలో వైఎస్ఆర్ సీపీ విషయానికొస్తే, ఆ పార్టీ అధినేత వైస్ జగన్ కు కాంగ్రెస్ పార్టీతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. అయితే తన తండ్రి మరణానంతరం తనకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి దక్కలేదనే అక్కసు తో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సీపీ కి పునాదులు వేశారు జగన్. అయితే “వైఎస్ఆర్ కు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం” కు ప్రతీకారమే వైసీపీ ఆవిర్భావం అనేది ఇక్కడ బయటకు కనిపించే కారణం.
ఇలా ఈ రెండు పార్టీల పుట్టుక వెనుక ఒక సెంటిమెంట్ ఉన్నట్లే ఒక పదవి ఆకాంక్ష కూడా కనిపిస్తుంది. అయితే వైసీపీ కి వైఎస్ఆర్ అనే ‘వ్యక్తి సెంటిమెంట్’ పునాదులు తవ్వితే బిఆర్ఎస్ కు ప్రత్యేక తెలంగాణ అనే ‘ప్రాంతీయ సెంటిమెంట్’ అస్త్రంగా మారింది.
అలాగే నాడు టీడీపీ ప్రభుత్వం కేసీఆర్ కు మంత్రి పదవి ఇచ్చివుంటే తెలంగాణలో తెరాస పుట్టి ఉండేదా.? కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధిష్టానం జగన్ ను సీఎం గా ప్రకటిస్తే ఏపీలో వైసీపీ రాజకీయ పుట్టుకకు అవకాశం వచ్చి ఉండేదా.? అన్న రెండు ప్రశ్నలు ఇప్పుడు ఆ రెండు పార్టీలను ఆలోచింపచేస్తున్నాయి.
దానికి కారణం వైసీపీ లో షర్మిల తిరుగుబాటైతే, బిఆర్ఎస్ లో కవిత పోరాటం. ఇప్పుడు ఈ ఇద్దరి వ్యవహారం (షర్మిల, కవిత) ఆ ఇద్దరి రాజకీయాన్ని (కేసీఆర్, జగన్) గుర్తుచేస్తున్నాయి. అటు పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ కు మాదిరి కవితకు కూడా ఒక మంత్రి పదవి ఇచ్చి ఉండి ఉంటే, ఇప్పుడు బిఆర్ఎస్ లో ఈ అంతర్గత యుద్దానికి చోటు ఉండేదా.?
అలాగే అటు వైసీపీ ఐదేళ్ల అధికారంలో షర్మిల కష్టానికి సరైన గుర్తింపు, గౌరవం దక్కివుంటే, జగన్ అందుకు ముందుకొస్తే ఇప్పుడు షర్మిల వ్యవహారంలో వైసీపీ ఇలా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడేదా.? అనే ఈ రెండు ప్రశ్నలు ఈ ఇద్దరి నాయకుల అభిమానులను తొలిచేస్తున్నాయి.
అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ రెండు పార్టీల అధినేతలు కూడా ఇలా తాము నమ్ముకున్న పార్టీలో తమకు సరైన పదవి దక్కలేదనే అక్కసుతోనే బయటకొచ్చి కొత్త పార్టీలను స్థాపించారు. ఇప్పుడు అదే మంత్రి పదవుల సమస్యలతో పార్టీలో అంతర్గత పోరును ఎదురుకుంటున్నారు.
BRS…YCP రెండు పార్టీల ఆవిర్భావానికి పదవులే పునాదులు వేస్తె ఇప్పుడు ఆ పదవులే శాపాలు గా మారి పార్టీ పునాదులను కదుపుతున్నాయి. ఇప్పటికే వైసీపీ షర్మిల రూపంలో బారి మూల్యం చెల్లించుకుంది, ఇక ఇప్పుడు బిఆర్ఎస్ కు కవిత గండం వెంటాడుతుంది. అయితే ఇక్కడ వైసీపీ కి వ్యతిరేకంగా స్థాపించిన షర్మిల రాజకీయ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాగా, బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కవిత జాగృతి ఏ గూటికి చేరనుందో చూడాలి.




