
మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు నేడు హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షం కావడంతో అటు తెలంగాణ రాజకీయాలలో అతి త్వరలో ఒక కీలక పరిణామం రాబోతోందా, బిఆర్ఎస్ పార్టీలో ఒక తీవ్ర అలజడి మొదలయ్యిందా అనే చర్చ ఊపందుకుంది.
ఫోన్ టాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించారని, ఆయన విచారణతో ఈ కేసులో ఇన్నాళ్లు తెరవెనుక దాగున్న బిఆర్ఎస్ పెద్ద తలకాయల పేర్లు బయటకొస్తాయని, తద్వారా వారి అరెస్టులు ఖాయమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ముఖ్యనేతలను ఉద్దేశించి పలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
Also Read – బనకచర్ల పేరుతో కాంగ్రెస్, బిఆర్ఎస్ యుద్ధాలు.. ఏపీకి తలనొప్పులు!
అయితే అందుకు తగ్గట్టే ఈ ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక అడుగు ముందుకు పడినట్టుగా ప్రభాకర్ రావు రాక నిర్ధారించింది. ఇన్నాళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వంతో దొంగ పోలీస్ ఆట ఆడుకున్న ప్రభాకర్ ఎట్టకేలకు సొంత రాష్ట్రానికి రాక తప్పలేదు. అమెరికా నుంచి హైద్రాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు ను సిట్ అధికారులు విచారించనున్నారు.
ఫోన్ టాపింగ్ కేసులో A 1 గా ఉన్న ప్రభాకర్ రావు దాదాపు 15 నెలల తరువాత సుప్రీం కోర్ట్ ఆదేశాలతో హైదరాబాద్ కు తిరిగొచ్చారు. అయితే ఇప్పటికే ఈ కేసులో విచారణ ఎదుర్కున్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రావు ఇచ్చిన స్టేట్మెంట్ తో ప్రభాకర్ రావు ను కూడా సిట్ విచారించనుంది.
Also Read – అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సర్వం సిద్దం
అయితే ప్రభాకర్ విచారణతో ఇప్పటివరకు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కేటీఆర్ పేరు అధికారికంగా బయటకొస్తుందా.? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే ఈ ఫోన్ టాపింగ్ సాయంతోనే గత ప్రభుత్వం తమ ప్రత్యర్థి పార్టీల నేతల వ్యవహారాల మీద పూర్తి నిఘా పెట్టగలిగిందని, తద్వారా వారిని ప్రజల ముందు దోషులుగా చిత్రీకరించగలిగింది అనే వాదన తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తుంది.
అందుకు తగ్గట్టే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు నుంచి ఫామ్ హౌస్ లో బీజేపీ నేతల కొనుగోళ్ల కేసు వరకు, సినీ సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల మీద జరిగిన ఫోన్ టాపింగ్ ఆరోపణల వరకు బిఆర్ఎస్ పై ఎన్నో ఆరోపణలు, మరెన్నో అనుమానాలు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఆ అనుమానాల నివృత్తి దిశగా అడుగులు వేస్తుందా.? లేక డ్రగ్స్ కేసు మాదిరి మీడియా హడావుడి తో సరిపెడుతుందా.? అనేది చూడాలి.
Also Read – షర్మిల ఫోన్ కేసీఆర్ ట్యాపింగ్ చేయిస్తే నాకేం సంబందం?